NTV Telugu Site icon

India US Trade: యూఎస్ ప్రొడక్ట్స్ హార్లే బైక్స్, బోర్బన్ విస్కీలపై సుంకం తగ్గించనున్న భారత్.!

Harley Bikes, Bourbon Whiskey

Harley Bikes, Bourbon Whiskey

India US Trade: డొనాల్డ్ ట్రంప్ ‘‘సుంకాల’’ దెబ్బకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచారు. ఏప్రిల్ నుంచి ‘‘పరస్పర సుంకాలు’’ అమలు చేస్తామని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాల తగ్గింపు, వాణిజ్యంపై భారత్, అమెరికా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా ఉత్పత్తులైన హర్లే-డేవిడ్సన్ బైక్స్, బోర్సన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తు్న్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం గతంలో హర్లే డేవిడ్సన్ బైకులపై దిగుమతి సుంకాన్ని 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. సుంకాలు మరింతగా తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రీమియం బైకులు భారత్‌లో సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా బోర్బన్ విస్కీ దిగుమతి సుంకాన్ని గతంలో 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. కాలిఫోర్నియా వైన్‌‌పై కూడా సుంకాలు తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయి.

Read Also: Congress: అమిత్ షాపై కాంగ్రెస్ ‘‘సభా హక్కుల ఉల్లంఘన నోటీసు’’..

140 కోట్ల జనాభా ఉన్న భారత మార్కెట్‌ యాక్సెస్ కోసం ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఒత్తిడి తీసుకువస్తున్నాడు. భారత్ తమ ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తుందని పలుమార్లు బహిరంగంగానే అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు కసరత్తు చేస్తున్నాయి. వాణిజ్య చర్చల్లో భాగంగా మోటార్ సైకిళ్లు, ఆల్కాహాల్ పానియాలకే పరిమితం కాకుండా, భారతదేశ ఔషధ ఉత్పత్తులు, రసాయనాల అమెరికా ఎగుమతి విస్తరణ గురించి కూడా అధికారులు చర్చిస్తున్నారు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఫార్మాసూటికల్ రంగంలో అమెరికా తన మార్కెట్‌ని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. అదే విధంగా భారత్ యూఎస్‌కి ఎగుమతుల అనుకూలమైన నిబంధనలను పొందాలని చూస్తోంది.

బోర్బన్ విస్కీ ,కాలిఫోర్నియా వైన్‌పై సుంకాలు తగ్గించడం వల్ల ఈ ఉత్పత్తులు భారత మద్యం మార్కెట్లో మరింత పోటీతత్వాన్ని పెరుగుతుంది. అదే సమయంలో, అమెరికా నుండి పెరిగిన ఔషధ దిగుమతులు ప్రపంచ జనరిక్ మెడిసిన్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే భారతీయ ఔషధ తయారీదారులపై ప్రభావం చూపుతాయి.