Millionaires Migration: భారతదేశం నుంచి మిలియనీర్లు వలస వెళ్లిపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. ఈ ఏడాది కూడా 6500 మంది మిలియనీర్లు దేశాన్ని వదిలి వెళ్లే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపద, పెట్టుబడి వలస పోకడలను పరిశీలించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు 2023 ఈ వివరాలను వెల్లడించింది. ఇలా వేరే దేశాలకు మిలియనీర్లు వలస వెళ్తున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది. చైనా ఏకంగా 13,500 మంది హై నెట్ వర్త్ కలిగిన వ్యక్తులను కోల్పోనుంది.
గతేడాది ఇండియా నుంచి 7500 మంది భారతదేశాన్ని వదిలి వెళ్లారు. అయితే ఈ ఏడాది ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సంఖ్య తగ్గింది. న్యూ వరల్డ్ వెల్త్ రీసెర్చ్ హెడ్ ఆండ్రూ అమోయిల్స్ ప్రకారం.. భారత్ నుంచి వెళ్లిపోతున్న మిలియనీర్ల కన్నా ఎక్కువ సంఖ్యలో కొత్త మిలియనీర్లను తయారు చేస్తోందని ఆయన తెలిపారు. సాధారణంగా 1 మిలియన్ డాలర్ల అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన వ్యక్తులను మిలియనీర్లు లేదా హై నెట్ వర్త్ వ్యక్తులు (HNWIలు)గా పేర్కొంటున్నారు. 2023లో 1,22,00 మంది, 2024లో 1,28,000 మంది మిలియనీర్లు వలస వెళ్లే అవకాశం ఉందని హెన్లీ & పార్ట్‌నర్స్ CEO డాక్టర్ జుర్గ్ స్టెఫెన్ చెప్పారు. గత దశాబ్ధకాలంలో మిలియనీర్ల వలసలు క్రమంగా పెరిగాయి.
Read Also: Ram Pothineni : పెళ్లి పీటలెక్కబోతున్న రామ్.. అమ్మాయి ఎవరంటే?
హౌరానీలోని ప్రైవేట్ వెల్త్ & ఫ్యామిలీ ఆఫీస్ పార్ట్‌నర్ అయిన సునీతా సింగ్-దలాల్ ప్రకారం.. పన్ను చట్టాలు క్లిష్టంగా ఉండటం, క్లిష్టమైన రూల్స్, దుర్వినియోగానికి దారి తీసే అవుట్ బౌండ్ రెమిటెన్స్ లకు సంబంధించి సంక్షిష్టమైన నియమాలు భారతదేశం నుంచి పెట్టుబడి వలసలు కొనసాగడానికి కారణం అవుతున్నాయని పేర్కొన్నారు. ఎక్కువ మంది భారతీయ సంపన్నులు సింగపూర్, దుబాయ్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు నిర్వహిస్తున్న గోల్డెన్ వీసా ప్రోగ్రామ్, అనుకూలమైన పన్నుల వాతావరణం, బలమైన వ్యాపార వ్యవస్థ, సురక్షితమైన-శాంతియుతమైన వాతావరణం భారత సంపన్నులను ఆకర్షిస్తున్నాయి.
2023లో ఆస్ట్రేలియాకు ఎక్కువ సంపన్నులు వలస వెళ్లే అవకాశం ఉంది. దాదాపుగా 5200 మంది ఆ దేశానికి క్యూ కట్టనున్నారు. గతేడాాి ఇది 3800 మాత్రమే ఉండేది. యూఏఈ రెండో స్థానానికి పడిపోతునంది. 2022లో యూఏఈకి 5200 మంది మిలియనీర్లు వలస వెళ్తే ఈ ఏడాది 4500 వెళ్లే అవకాశం ఉంది. సింగపూర్ కి 3200 మంది సంపన్నులు తరలిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్విట్జర్లాండ్, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, న్యూజిలాండ్ దేశాలకు కూడా సంపన్నులు తరలిపోతున్నారు.