S-400: పాకిస్తాన్, చైనా దేశాలకు చేదు వార్త. భారత్ రక్షణ దళాలు రష్యాకు బయలుదేరాయి. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఒకటైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై అధునాతన శిక్షణ తీసుకోవడానికి మన సైనికులు పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్లారు. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, భారత్ రష్యానుంచి మరో మూడు S-400 యూనిట్లు కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తన వైమానిక రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి భారత్ గతంలో ఐదు S-400 వ్యవస్థల్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు మరికొన్నింటిని తీసుకోవాలని భావిస్తోంది.
Read Also: CM Chandrababu: దుబాయ్‌లో సీఎం చంద్రబాబు.. యూఏఈ-ఏపీ మధ్య వాణిజ్య, సాంకేతిక బంధం బలోపేతం..!
S-400 అడ్వాన్సుడ్ వెర్షన్ S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం కూడా చర్చలు ప్రారంభమయ్యాయని విషయం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. ఈ ఒప్పందం కుదిరితే , శత్రు దేశాల నుంచి వచ్చే వైమానిక ముప్పులను మరింత సమర్థవంతంగా అడ్డుకుంటుంది. డిసెంబర్ నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలు వస్తున్నాయి. ఆయన పర్యటనలో భారత్-రష్యాల మధ్య కీలక రక్షణ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
ఎస్-400 వ్యవస్థలకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించి, ట్రాక్ చేసి నాశనం చేసే సత్తా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇది వివిధ ఎత్తుల్లో వచ్చే వైమానిక ముప్పులైన ఫైటర్ జెట్లు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్ల వంటి వాటిని గుర్తించి, గాలిలోనే నాశనం చేయగలదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్ వైపు ప్రయోగించిన చైనీస్ తయారీ పీఎల్-15 వంటి క్షిపణుల్ని కూల్చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ (AEW&C) లేదా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో విజయవంతంగా ట్రాక్ చేసి నాశనం చేయడం ద్వారా ఎస్-400 సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది.
