India: సౌదీ అరేబియా-పాకిస్తాన్ కీలకమైన ‘‘వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని’’ కుదర్చుకున్నాయి. దీని ప్రకారం, ఒక దేశంపై దాడి రెండు దేశాలపై దాడిగా గుర్తిస్తామని ఒప్పందం నొక్కి చెబుతోంది. దీని ద్వారా, భారత ప్రయోజనాలకు దెబ్బపడే అవకాశం ఉంది. దీనిపై భారత్ స్పందించింది. భారత్- సౌదీ అరేబియా పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని ఆశిస్తున్నట్లు భారతదేశం తెలిపింది.
Read Also: Pakistan: అరేయ్ మునీర్, మీరు మారరా.? భారత్, హిందుత్వపై విషం కక్కిన పాక్ ఆర్మీ..
‘‘ భారత్, సౌదీ అరేబియాల మధ్య విస్తృత శ్రేణి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఇది గత కొన్ని ఏళ్లుగా పెరిగింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర ప్రయోజనాలను, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని మేము ఆశిస్తున్నాము’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో అన్నారు. అంతకుముందు గురువారం, భారత్ ఈ పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. భారత జాతీయ ప్రయోజనాలను, అన్ని రంగాల్లో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.
ఈ ఒప్పందం ప్రకారం, సౌదీ అరేబియా తన రక్షణ కోసం పాకిస్తాన్ అణ్వాయుధాలను పరిగణలోకి తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది భారత్‌ను ఆందోళన పరిచే అంశంగా ఉంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సౌదీ ప్రభుత్వంతో ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. దోహాలో 40 ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఖతార్‌పై ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే, ఈ ఒప్పందం భారత జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది మోడీ ప్రభుత్వ దౌత్య వైఫల్యంగా విమర్శిస్తోంది.
