NTV Telugu Site icon

Canada: తీరుమార్చుకోని కెనడా.. ఖలిస్తానీల ‘‘సిటిజన్ కోర్టుల’’పై భారత్ ఆగ్రహం..

Modi

Modi

Canada: కెనడా ఖలిస్తానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులపై మెతక వైఖరి అవలంభిస్తూనే ఉంది. భారత్ ఎన్నిసార్లు నిరసన తెలిపినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. మరోవైపు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతికి ఆ దేశ పార్లమెంట్ నివాళి అర్పించడాన్ని బట్టి చూస్తే కెనడా ఏ రకంగా వారికి మద్దతు తెలుపుతుందో అర్థం అవుతోంది. నిజ్జర్ హత్య తర్వాత నుంచి భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి.

Read Also: International Yoga Day 2024: ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం.. ‘సూర్య నమస్కారం’

ఇదిలా ఉంటే వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్తానీ తీవ్రవాదులు “సిటిజన్స్ కోర్టు” అనే పేరుతో భారత ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేయడంపై గురువారం భారత్, కెనడాకు తమ నిరసన వ్యక్తం చేసింది. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చోటు ఇవ్వడంపై భారత్ తమ నిరసనను కెనడా హైకమిషన్‌కి తెలియజేసింది.

గతేడాది కెనడాలోని సర్రే నగరంలో గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని కాల్చి చంపారు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందని ఏకంగా కెనడా ప్రధాని ట్రూడో చెప్పడం సంచలనమైంది. దీనిపై భారత్ కూడా ఘాటుగా స్పందించింది. కెనడా తీవ్రవాదులు, ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విమర్శించింది. ట్రూడో ఆరోపణల్ని అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. ఈ ఘటన తర్వాత ఖలిస్తానీలు కెనడాలోని భారత దౌత్యకార్యాలయాలపై తరుచుగా దాడులకు, నిరసనలకు తెగబడుతున్నారు.