Site icon NTV Telugu

India-Pakistan Conflict: కరాచీ, లాహోర్, రావల్పిండి సహా 9 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు: పాక్ ఆర్మీ..

Pak

Pak

India-Pakistan Conflict: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ రోజు ఉదయం పాకిస్తాన్ లాహోర్‌తో పాటు ఇతర నగరాల్లో పేలుడు శబ్ధాలు వినిపించడంతో ఒక్కసారికి పాక్ ప్రజల్లో వణుకు పట్టింది. భారత్ మళ్లీ దాడి చేస్తుందా..? అనే అనుమానాలు పాక్ ప్రజలు వ్యక్తపరిచారు. అయితే, తాజాగా పాక్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్‌పీఆర్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ పేలుళ్లకు భారత్ కారణమని ఆరోపించింది. తాము ఇండియాకు చెందిన 12 డ్రోన్లను కూల్చామని పాక్ ఆర్మీ చెబుతోంది.

పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్, రావల్పిండి, గుజ్రాన్‌వాలా, అటాక్, బహవల్పూర్ వంటి నగరాలపై డ్రోన్ అటాక్స్ జరిగాయని ఐఎస్‌పీఆర్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఆరోపించారు. డ్రోన్ దాడుల తర్వాత కిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (PAA) కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్ మరియు సియాల్‌కోట్ ప్రధాన విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది. విమానయాన అధికారులు “నోటీస్ టు ఎయిర్‌మెన్” (NOTAM) ద్వారా అన్ని విమానయాన సంస్థలకు దీని గురించి తెలియజేశారు.

Read Also: Operation Sindoor: “ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు”: రాజ్‌నాథ్ సింగ్..

పాక్ మీడియా ప్రకారం, లాహోర్‌కు వచ్చే అన్ని విమానాలను కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు, ఇందులో జెడ్డా, దుబాయ్, మస్కట్, షార్జా మరియు మదీనా నుండి వచ్చే విమానాలు కూడా ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయం, సియాల్‌కోట్ విమానాశ్రయాలను ఖాళీ చేయించారు. కరాచీ జిన్నా విమానాశ్రయం కూడా మూసి వేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, గురువారం ఉదయం, లాహోర్‌లోని వాల్టన్ రోడ్ మరియు పరిసర ప్రాంతాల్లో ఒకదాని తర్వాత ఒకటి మూడు పెద్ద పేలుళ్లు వినిపించాయి, దీనితో భయాందోళనలు చెలరేగాయి మరియు ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు వచ్చారు. మూడు పేలుళ్లు కొన్ని సెకన్లలోనే జరిగాయని, వాటి శబ్దాలు అనేక కిలోమీటర్ల దూరం వినిపించాయని లాహోర్ పోలీసులు తెలిపారు.

Exit mobile version