NTV Telugu Site icon

PM Modi: వాళ్ల సొంతగడ్డపైనే ఉగ్రవాదుల్ని లేపేస్తున్నాం.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో మన దేశ భద్రతాబలగాలు ఉగ్రవాదుల్ని వాళ్ల సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని గురువారం అన్నారు. సుస్థిర ప్రభుత్వం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను దేశ ప్రజలు చూశారని మరోసారి మోడీ సర్కార్ రావాలనే ప్రతిధ్వనులు దేశవ్యాప్తంగా వినిపిస్తు్న్నాయని అన్నారు.

దేశంలో బలహీనమైన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడల్లా శత్రువులు ప్రయోజనం పొందారని, ఉగ్రవాదం విస్తరించిందని, కానీ బలమైన మోడీ ప్రభుత్వంలో మన బలగాలు వారి సొంత గడ్డపైనే ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నాయని చెప్పారు. అవినీతిపరులు దేశాన్ని దోచుకోకుండా అడ్డుకున్నానని, అందుకే తనపై వారంతా కోపంగా ఉన్నారని అన్నారు. భారత్ గతంలో కన్నా బలంగా మారిందని, త్రివర్ణ పతాకం యుద్ధప్రాంతంలో భద్రతకు హామీగా మారిందని ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడారు.

Read Also: Sana Begum: ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందుకు క్షమాపణలు చెప్తూ పోస్ట్‌..!

‘‘నిన్న నేనున భారతదేశ దక్షిణ కొనలో ఉన్న తమిళనాడులో ఉన్నాను. అక్కడి ప్రజలు ఈసారి మోడీ ప్రభుత్వం కావాలని అంటున్నారు. ఈ రోజు నేను హిమాలయాల ఒడిలో బాబా కేథార్ మరియు బద్రీ విశాల్‌ల పాదాల చెంత ఉన్నారు. ఇక్కడ కూడా అదే ప్రతిధ్వనిస్తోంది. మరోసారి మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లో భారతదేశాన్ని గతంలో కన్నా మెరుగ్గా మార్చాం.’’ అని ప్రధాని మోడీ అన్నారు.

7 దశాబ్ధాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశామని, ట్రిపుల్ తలాక్‌కి వ్యతిరేకంగా చట్టం చేశామని, లోక్‌సభ-అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, జనరల్ వర్గానికి చెందిన పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లేవని ఆరోపించారు. భారతీయులు తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను మన సైనికులకు అందించింది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పారు. నేడు ఆధునిక తుపాకులు, యుద్ధవిమానాలు, విమాన వాహక నౌకల వరకు ప్రతీది దేశంలోనే తయారు చేయబడుతోందని ప్రధాని చెప్పారు.