Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ని రూ. 12,636 కోట్ల మోసం చేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేశారు. ఆర్థిక నేరస్తుడిని భారత్ దేశానికి తీసుకువచ్చేందుకు మన సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు 8 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా, భారత్ అప్పగింత అభ్యర్థన మేరకు బెల్జియంలో అదుపులోకి తీసుకున్నారు.
గీతాంజలి గ్రూప్ యజమాని అయిన మెహుల్ చోక్సీ, తన మేనల్లుడు నీరవ్ మోడీ, అతని భార్య అమీ మోడీ, అతని సోదరుడు నీషాల్ మోడీతో కలిసి ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 12,636 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే కొన్ని వారాలకు ముందే విదేశాలకు చెక్కేశాడు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆంటిగ్వా పౌరసత్వం తెచ్చుకున్నాడు.
Read Also: Merugu Nagarjuna: అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు
అయితే, 2021లో చోక్సీ డొమినికల్ రిపబ్లిక్‌లోకి అక్రమంగా ప్రవేశించడంతో అతడిని ఆ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అతడిని కస్టడీలోకి తీసుకునేందుకు అక్కడికి వెళ్లింది. చోక్సీ న్యాయవాదులు అతడి చికిత్స కోసం ఆంటిగ్వా వెళ్లాలని, విచారణ తర్వాత తిరిగి వస్తామని డొమినికన్ కోర్టుకు హామీ ఇచ్చారు. 51 రోజుల జైలు శిక్ష అనంతరం చోక్సీకి బ్రిటిష్ క్వీన్స్ ప్రివీ కౌన్సిల్ నుంచి ఉపశమనం లభించింది. ఆ తర్వాత అతడు ఆంటిగ్వాకు తిరిగి వెళ్లాడు. దీని తర్వాత డొమినికన్ రిపబ్లిక్ అతడిపై అక్రమ ప్రవేశ అభియోగాలను కొట్టేసింది.
అతడి కదలికల్ని సీబీఐ, ఈడీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం అతను బెల్జియంలో ఉన్నట్లు కనుగొన్నారు. మోసానికి సంబంధించిన పత్రాలను భారత అధికారులు బెల్జియంకు సమర్పించారు. బెల్జియం పోలీసులు ఏప్రిల్ 12న చోక్సీని అరెస్ట్ చేశారు. అతను తన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కనుగొన్నారు. చోక్సీ భార్య ప్రతీ బెల్జియం పౌరురాలు. నివేదిక ప్రకారం, చోక్సీ బెల్జియంలో నివాసం పొందేందుకు నకిలీ పత్రాలను సమర్పించినట్లు తేలింది. తాను భారత్, ఆంటిగ్వా పౌరుడనే విషయాన్ని కూడా దాచిపెట్టాడు.
అంతకు ముందు, అతడి న్యాయవాదులు చోక్సీకి బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం బెల్జియంలో ఉన్నందున అతను భారత్ తిరిగి రాలేడని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ఏజెన్సీలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చోక్సీ చెప్పాడు.