ప్రపంచమంతా సంక్షోభంలో ఉండగా భారత్ మాత్రం ఆర్థికంగా దూసుకుపోతుంది. ఇందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదు కావడమే ఉదాహరణ. ఇదే అంశంపై ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత బలాన్ని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల విజయాన్ని, 140 కోట్ల భారతీయుల కష్టానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించిన ప్రధాని మోడీ.. “భారత్ వృద్ధి వేగం బలంగా కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం జీడీపీ వృద్ధి, అదే ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదవడం దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తోంది” అని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించడం కోసం ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లక్ష్యాలతో సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపారు.
7.7 శాతానికి చేరిన జీడీపీ
గణాంకాల మంత్రిత్వ శాఖ జూన్ 5న విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది రెండో అడ్వాన్స్ అంచనాల్లో పేర్కొన్న 7.6 శాతం కంటే ఎక్కువ. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7.1 శాతంగా నమోదైంది.
నాలుగో త్రైమాసికంలో 7.8% వృద్ధి
2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4)లో జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. అయితే ఇది మూడో త్రైమాసికం (Q3)లో నమోదైన 8 శాతం వృద్ధి కంటే స్వల్పంగా తక్కువ. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) వృద్ధి 12.8 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గడం వల్ల త్రైమాసిక వృద్ధిలో కొంత మందగమనం కనిపించినట్లు గణాంకాలు వెల్లడించాయి. అయినప్పటికీ ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సంజయ్ మల్హోత్రా..
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా అన్నారు. ఒక కార్యక్రమంలో సంజయ్ మల్హోత్రా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయ సంక్షోభాలు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉందని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎంతో స్థిరంగా.. ఆరోగ్యకరంగా ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు భారత్‌కు మాత్రమే పరిమితం కావని.. అన్ని దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉందని.. గతంలో ఎదుర్కొన్న ఇలాంటి ఆర్థిక షాక్‌లతో పోల్చినా దేశం మరింత బలంగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
India’s growth momentum remains strong!
GDP growth rate of 7.7% in FY 2025-26 and 7.8% in Q4 of FY 2025-26 reflect the inherent strength of our economy, the success of reforms and the hard work of 140 crore Indians.
We shall leave no stone unturned to further ‘Ease of Living,’…
— Narendra Modi (@narendramodi) June 5, 2026
