India Pakistan War: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన కొద్దిసేపటికే, భారత్ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌కి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత్‌పై భారీ దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సాయుధ దళాలు పాకిస్తాన్ ‘‘గగనతల రక్షణ వ్యవస్థ’’ని నాశనం చేసినట్లు ప్రకటించాయి. పాక్ భారత్‌లోని 15 నగరాలపై డ్రోన్-మిస్సైల్ దాడులు చేసేందుకు ప్రయత్నించిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: India Pakistan Tension: పాకిస్తాన్‌కి భారత్ బిగ్ షాక్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..
‘‘మే 7 మరియు 8 తేదీల మధ్య రాత్రి, పాకిస్తాన్ అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరాలాయ్, భుజ్‌తో సహా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక లక్ష్యాలను డ్రోన్‌లు, క్షిపణులను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించింది’’ అని అధికార ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకుని నాశనం చేసింది. చైనా తయారు చేసిన పాకిస్తాన్ HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్లను ఇజ్రాయెల్ తయారు చేసిన HAROP డ్రోన్లు ధ్వంసం చేసినట్లు, ప్రస్తుతం లాహోర్‌లోని పాక్ ఆర్మీ ఎలాంటి రక్షణ లేకుండా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత సైన్యం గురువారం ఉదయం పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్, వైమానిక రక్షణ రాడార్లను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. డ్రోన్లు మరియు క్షిపణులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్, రష్యా తయారు చేసిన S-400 ‘సుదర్శన్ చక్ర’ వైమానిక రక్షణ వ్యవస్థలు నాశనం చేసినట్లు భారత్ తెలిపింది. భారత్ దాడితో పాకిస్తాన్ లాహోర్, సియాల్‌కోట్, కరాచీ ఎయిర్‌పోర్టుల్ని పూర్తిగా మూసేసింది.