NTV Telugu Site icon

Qatar: ఖతార్‌లో మాజీ నావీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ దాఖలు చేసిన భారత్..

Qatar

Qatar

Qatar: గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖతార్ ప్రభుత్వం 8 మంది మాజీ ఇండియన్ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసిన అక్కడి అధికారులు, ఇటీవల మరణశిక్ష విధించారు. దీనిపై భారత్ షాక్‌కి గురైంది. దీనిపై న్యాయపరంగా, దౌత్యపరంగా పోరాటానికి భారత్ సిద్ధమైంది.

8 మంది భారతీయులకు మరణశిక్ష విధించడంపై భారత్ ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మాట్లాడుతూ.. ఢిల్లీ ఇప్పటికే అప్పీల్ దాఖలు చేసినట్లు చెప్పారు. గతంలో ఈ తీర్పు పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవని బాగ్చి చెప్పారు. తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో 8 మంది కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నామని, సాధ్యమైన సాయాన్ని అందిస్తామని చెప్పారు.

Read Also: Madhavi Latha: రష్మిక ఫేక్ వీడియోపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు.. ఆమె వేసుకునే డ్రెస్సుల కంటే అసభ్యమా?

శిక్ష పడిన 8 మంది గతంలో ఇండియన్ నేవీలో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఖతార్ లోని సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలు అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీ అండ్ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నారు. అయితే ఇటాలియన్ టెక్నాలజీ ఆధారంగా స్టెల్త్ సబ్‌మెరైన్లకు సంబంధించిన సన్నితమైన సమాచారాన్ని ఇజ్రాయిల్‌కి అందించారని, గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ కేసులో కెప్టెన్ హోదాలో రిటైర్ అయిన నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ట్, కమాండర్ హోదాతో పనిచేసిన అమిత్ నాగ్ పాల్, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, మరొకరు ఉన్నారు. ఈ కేసులో వీరు పనిచేస్తున్న కంపెనీ యజమానిని అరెస్ట్ చేసినా.. ఆ తరువాత క్షమాభిక్షపై వదిలేసింది ఖతార్. అయితే దీని వెనక ఖతార్, పాకిస్తాన్, ఐఎస్ఐ కుట్ర దాగి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.