E85 Petrol: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి సంక్షోభం భారత్‌లో ఇంధన రంగాన్ని అతలాకుతలం చేసింది. దేశంలో గ్యాస్, పెట్రోల్-డీజిల్‌పై ప్యానిక్ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ పరిస్థితిని అధిగమించేందుకు కీలక అడుగు వేస్తోంది. పెట్రోల్‌లో అధిక మొత్తంలో ఇథనాల్‌ను కలపడానికి సంబంధించిన నిబంధనల్ని ప్రతిపాదిస్తూ కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది అమలయితే భవిష్యత్తులో E85 పెట్రోల్‌తో వాహనాలు నడిచే అవకాశం ఉంది.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ముసాయిదా నిబంధనల్లో పెట్రోల్‌లో 85 శాతం ఇథనాల్ కలిపే E85 ఫ్యూయల్‌ను చేర్చారు. E100ను కూడా ప్రతిపాదించారు, అంటే భవిష్యత్తులో పూర్తిగా ఇథనాల్‌తో వాహనాలను నడపొచ్చు. ఈ మార్పు భారత్‌లో ఇందన వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి E20 పెట్రోల్ వాడుతున్నారు.
Read Also: UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
ప్రభుత్వం ఈ ముసాయిదానున ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది. ప్రజలు, పరిశ్రమ వర్గాల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. సూచనలు, సలహాలు తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. గతేడాడి ఏప్రిల్‌లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాలు కలిపి E20 పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా తీసుకువచ్చారు. ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్తులో భారత్ తన ఇంధన అవసరాల కోసం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటుంది.
ఇది ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు, కానీ ఇది అమలు కావాలంటే ఈ85 పెట్రోల్‌కు అనుగుణంగా వాహనాల ఇంజన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఒక కార్యక్రమంలో మాట్లాుడతూ.. పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. వీటి స్థానంలో తయారీదారులు వీలైనంత త్వరగా బయోఫ్యూయల్స్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ఖరీదైనవి మాత్రమే కాకుండా దేశానికి తీవ్రమైన సమస్యగా కూడా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
