india comments on china in UNSC: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డ్రాగన్ దేశం చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఉగ్రవాదులపై చైనా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలన్న అమెరికా, భారత్ ప్రతిపాదనలను యూఎన్ లో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంది. గురువారం యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చైనా తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపైన నిష్ఫక్షపాతంగా వ్యవహరించాలని భారత్ పిలుపునిచ్చింది.
ప్రపంచంలో అత్యంత భయంకరమైన తీవ్రవాదులపై ఆంక్షలు విధించడానికి రాజకీయాలు చేయకూడదని..కానీ మేము ఈ కౌన్సిల్ లో దీన్ని చూశామని జై శంకర్ చైనాను ఉద్దేశిస్తూ అన్నారు. పట్టపగలు ఘోరమైన దాడులను అందుకు కారణం అయినవారిని శిక్షించకుండా వదిలేయకూడదని.. ఈ మండలి శిక్షార్హతపై సంకేతాలను పంపాలని అన్నారు. విశ్వసనీయతను నిర్థారించాలంటే స్థిరత్వం ఉండాలని జైశంకర్ అన్నారు.
సాజిద్ మీర్ భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. 2008 ముంబై దాడుల ప్రధాన హ్యండ్లర్ గా వ్యవహరించాడు. సాజిద్ మీర్ ను బ్లాక్ లిస్టులో చేర్చాలన్న ప్రతిపాదనను చైనా మూడు సార్లు అడ్డుకుంది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు రవూఫ్ అజార్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలన్న భారత్, అమెరికా ప్రతిపాదనలను గత నెలలో చైనా నిలుపుదల చేసింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని నిషేధిత జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనను కూడా చైనా అడ్డుకుంది. ఆప్తమిత్రులు పాకిస్తాన్ కోసం ఇదంతా చేస్తుంది డ్రాగన్ కంట్రీ.
మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేసింది భారత్. వెంటనే కాల్పుల విరమణ చేసి దౌత్యమార్గాలు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని జైశంకర్ కోరారు. ఇది యుద్ధాల యుగం కాదని ప్రధాని మోదీ వ్యాఖ్యలను నొక్కిచెప్పారు. ప్రపంచీకరణ ప్రపంచంలో ఈ యుద్దం సుదూర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపిస్తోందని ఆయన అన్నారు. భారత్ కూడా ఈ ప్రభావాన్ని అనుభవిస్తోందని.. ఆహారం కొరత, ఎరువుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో అన్నారు.