మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు నెలలకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహారాష్ట్రలో అత్యధిక లోక్‌సభ సీట్లను సొంతం చేసుకుంది. 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ థాకరే పార్టీ 9, శరద్ పవార్ పార్టీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమికి గట్టి షాకిచ్చింది. మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక బూస్టింగ్‌లాంటిదని కూటమి భావించింది. అధికారం కోసం ఎన్నో కలలు కంది. లోక్‌సభలో వచ్చిన ఉత్సాహమే.. అసెంబ్లీలో కూడా అదే తరహాలో ఉంటుంది అని కాంగ్రెస్ కూటమి భావించింది. తీరా ఆరు నెలలు తిరిగేసరికి అంతా తుస్‌మని పోయింది. తాజాగా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో బొమ్మ.. బొరుసైంది. మహా వికాస్ అఘాడీ కూటమి భారీ ఓటమిని కూడగట్టుకుంది. 228 స్థానాలు ఉండగా కేవలం 54 స్థానాలతో ఇండియా కూటమి సరిపెట్టుకుంది. ఇక మహాయుతి కూటమి(ఎన్డీఏ) ఏకంగా 227 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా నిలిచింది.
తాజాగా విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పండితులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఆరు నెలల్లో ప్రజల్లో ఎంత మార్పు అంటూ సంభాషించుకుంటున్నారు. గరిష్ట స్థాయి నుంచి కనిష్ట స్థాయికి ఇండియా కూటమి పడిపోయిందని గుసగుసలాడుకుంటున్నారు. ఇక శరద్‌పవార్(83) ఇప్పటికే రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 2026లో శరద్ పవార్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. అనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఉద్ధవ్ థాకరే పార్టీ కూడా భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొంది. తాజా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమిని విశ్వసించారు. దాదాపు 288 సీట్లకు గాను 227 సీట్లను మహాయుతి కూటమికి కట్టబెట్టి తిరుగులేని శక్తిగా నిలిపారు.