NTV Telugu Site icon

INDIA Bloc: ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ముక్కలు..? ఒక్కోక్కరిగా బయటకు వెళ్తున్న నేతలు..

India Alliance

India Alliance

INDIA Bloc: 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఇండియా కూటమి ముక్కలు అవుతుందా..? ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపేందుకు, బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కోవాలని దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ లక్ష్యం నెరవేరక ముందే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూటమిని వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఒంటరి పోరనే చెప్పింది.

తాజాగా బీహార్ రాజకీయాల్లో పరిణామాలు కూడా ఇండియా కూటమికి ఝలక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి సృష్టికర్తల్లో ఒకరిగా పేరున్న బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోసారి తన పాత మిత్రుడు బీజేపీతో జతకట్టేందుకు నితీష్ కుమార్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రధానమైన మూడు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల ముందే సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరిన సీట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంది. దీంతో అప్పటి నుంచి ఎస్పీ కూటమికి అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది.

ఈ నెల 29న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ బీహార్‌లోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో నితీష్ కుమార్ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, కేరళలో సీపీఎం, కాంగ్రెస్‌లకు పడటం లేదు. చివరకు రాహుల్ గాంధీ వయనాడ్‌లోనూ పోటీ చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, తృణమూల్ మధ్య చిచ్చుకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కారణమని టీఎంసీ ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ ఆరోపించారు. ఇండియా కూటమిని కూల్చేందుకు బీజేపీ తరుపున ఆయన పనిచేస్తున్నట్లు టీఎంసీ ఆరోపించింది.

Read Also: Bihar Politics: బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం నితీష్‌ని గద్దె దింపేందుకు లాలూ ప్లాన్.?

5 రాష్ట్రాల ఫలితాలు, రామ మందిరమే మూడ్‌ని మార్చిందా..?

గతేడాది చివర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఇండియా కూటమిలో అభద్రతను పెంచాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ చేతుల్లో పెట్టింది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సాధించింది బీజేపీ. తెలంగాణలో గెలిచినప్పటికీ, అది పూర్తిగా కాంగ్రెస్ గెలుపు కన్నా టీఆర్ఎస్ తప్పిదాలే అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మిజోరాంలో కూడా బీజేపీ అనుకూల ప్రభుత్వమే ఉంది.

2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజలు ముందు దేశ ప్రజల మూడ్‌ని తెలిపే ఎన్నికల్లో మరోసారి బీజేపీ సత్తా చాటడంతో కాంగ్రెస్ మీదు టీఎంసీ, జేడీయూ, ఆప్ వంటి పార్టీలు అపనమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంతో బీజేపీ ఇప్పటికే దేశంలోని ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఇండియా కూటమిలో మాత్రం ఇంకా సీట్ల పంపకాలపై సయోధ్య కుదరడం లేదు. జేడీయూ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుంచే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తోంది.

Show comments