Site icon NTV Telugu

Amit Shah: కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో మతమార్పిడులకు పాల్పడుతోంది.

Amit Shah

Amit Shah

Amit Shah: 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పండరియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేద గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మతమార్పిడి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ స్కాములను వెలికితీసి, అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని జైలుకు పంపుతామని అమిత్ షా అన్నారు.

ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ని ‘ప్రీపెయిడ్ సీఎం’గా అభివర్ణించిన అమిత్ షా.. రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో మతమార్పిడి పెరుగుతోందని, రాజ్యాంగంలో ప్రతీ పౌరుడు కూడా తన ఇష్టానుసారం మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఇచ్చింది.. కానీ కాంగ్రెస్ పేద గిరిజనులను మతమార్పిడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారంటూ ఆరోపించారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటిలో, గ్రామంలో ఘర్షణలు చెలరేగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.

Read Also: BJP MP Laxman: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..

బీజేపీ ప్రభుత్వం ఎవరి మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదని, అయితే ఏ ప్రభుత్వమైన మతమార్పిడులు చేస్తే దాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. సీఎం భూపేష్ బఘేల్ రాష్ట్రం డబ్బును ఢిల్లీకి తీసుకెళ్తున్నారని, రాష్ట్రాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ని నిందించారు. బఘేర్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో రెండు విడుతలుగా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి, అధికారంలోకి రావాలని బీజేపీ పోరాడుతోంది. ఛత్తీస్గఢ్ తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.

Exit mobile version