దేశంలో ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిశాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగింది. అయితే.. ఉత్తర ప్రదేశ్ లోని రెండు గ్రామాలు, జార్ఖండ్‌లో ఒక గ్రామ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీనికి కారణమేంటని ఆరా తీయగా.. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదని.. అందుకే తాము ఓటు వేయడం లేదని తెలుపుతున్నారు. తమ గ్రామ అభివృద్ధి గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని హిసంపూర్ మర్హోలో వేలాది మంది ఓటర్లు ఇంటికే పరిమితమయ్యారు. అంతకుముందు.. గ్రామంలో కూడల్ల వద్ద గ్రామస్తులు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటిస్తూ పోస్టర్లు వెలిశాయి. తమ ‘‘గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదు.. ఎక్కడికైనా వెళ్లాలంటే రైలు పట్టాలు దాటాలి.. పిల్లలు స్కూల్‌కి వెళ్లాలంటే పట్టాలు దాటాల్సిందే.. దాదాపు డజను మందిని రైళ్ల కింద పడి చనిపోయారని.. ఈ క్రమంలో ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు” అని గ్రామస్తులు అంటున్నారు.
Jani Master: రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. అసలు విషయం చెప్పేశాడు!
మరోవైపు.. ఓటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత గ్రామంలోని ఎవరూ పోలింగ్ బూత్ వద్దకు రాకపోవడంతో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ మహేంద్ర శ్రీవాస్తవ , ఇతర అధికారులు కలిసి గ్రామస్తులను ఓటు వేయమని అభ్యర్థించారు. అయినప్పటికీ గ్రామాస్తులు.. అభివృద్ధి జరిగే వరకు ఓటు వేసేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు.. పరాహాజీ గ్రామ ప్రజలు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. వారి సమస్య కూడా వంతెన కోసమే.
అటు.. జార్ఖండ్‌లోని కుసుంభ గ్రామంలోని 2 వేల మందికి పైగా ఓటర్లు ఓటు వేయలేదు. ఈ క్రమంలో.. డిప్యూటీ కమిషనర్ నాన్సీ సహాయ్ మాట్లాడుతూ, “కుసుంభలోని రెండు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. నేను, ఎస్పీ అరవింద్ కుమార్‌తో కలిసి ఓటు వేయమని గ్రామానికి వెళ్ళాము.” బ్రిడ్జి కావాలన్న తమ డిమాండ్ నెరవేరితే ఓటేస్తామని గ్రామస్తులు చెప్పినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హజారీబాగ్‌లో ప్లాంట్ ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌ను గ్రామస్తులు వంతెన కోసం కోరినట్లు అధికారులు వివరించారు. అయితే అండర్‌పాస్‌ను నిర్మించాలని ఎన్‌టీపీసీ నిర్ణయించింది. అయితే దీనివల్ల తాగునీరు, నిత్యావసర సరుకులు, వైద్య సేవలకు ఇబ్బందిగా మారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయమై గత రెండు నెలలుగా ఎన్టీపీసీతో మాట్లాడుతున్నామని జిల్లా యంత్రాంగం తెలిపింది.