Red Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిన్న ముంబయిలో భారీ వర్షాల దెబ్బకు జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. అయితే, జులై 12వ తేదీన పశ్చిమ బెంగాల్, సిక్కిమ్‌లలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. బిహార్‌లో రానున్న మూడు రోజులు వానలు పడతాయని చెప్పుకొచ్చింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో మాత్రం జులై 11 వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. జులై 12న ఢిల్లీ, హరియాణ, జమ్మూ అండ్ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌లో కూడా జడి వానలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ సూచించింది.
Read Also: Hurricane Beryl: టెక్సాస్ లో బెరిల్ తుఫాన్ బీభత్సం.. ముగ్గురు మృతి..!
కాగా, ముంబయిలో భారీ వర్షాలతో స్కూల్, కాలేజీలకు నేడు బీఎంసీ అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు పుణేలో కూడా 12వ తరగతి వరకు విద్యా సంస్థలు బంద్ చేశారు. రాయగఢ్‌లో కూడా పలు ప్రాంతాలు జలమయం కావడంతో కాలేజీలు, పాఠశాలలను ఇప్పటికే మూసి వేశారు. పాల్ఘర్, థానే, నాసిక్, జల్‌గావ్, అహ్మద్‌నగర్, చంద్రపుర్, కొల్హాపుర్, షోలాపుర్, సింగ్లి, ఔరంగాబాద్, జల్నా, అమరావతి, గడ్చిరౌలిలో ఇవాళ కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.