If two women want to live together they can says Madhya Pradesh High Court: మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఇద్దరు మహిళలు కలిసి ఉంటున్న కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు మహిళలు తమ ఇష్టానుసారం కలిసి జీవించాలనుకుంటే.. వారిని కోర్టు అడ్డుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తన కూతురును తనకు అప్పగించాలని కోరుతూ.. 18 ఏళ్ల యువతి తండ్రి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారించింది. 18 ఏళ్ల అమ్మాయి, 22 ఏళ్ల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఈ ఘటన రాష్ట్రంలోని జబల్ పూర్ లో జరిగింది.
Read Also: Uttar Pradesh: యూపీలో దారుణం.. మహిళపై భర్త, మరిది అత్యాచారం.. ట్రిపుల్ తలాక్‌తో మోసం
పారిపోయిన ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కలిసి చదువుకున్నారు. కాలక్రమేణా వీరిద్దరి మధ్య మానసికంగా సంబంధం ఏర్పడింది. ఇద్దరు విడిచి ఉండలేమని నిర్ణయించుకుని ఇళ్ల నుంచి పారిపోయారు. ఇద్దరి మధ్య సంబంధం కుటుంబ సభ్యులకు తెలియడంతో వీరిద్దరు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ కుమార్తెను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ 18 ఏళ్ల బాలిక తండ్రి గత నెలలో హైకోర్టులో పిటిషన్ వేశారు.
తన కుమార్తెను సదరు యువతితో ఉండకుండా కుటుంబంతో కలిసి ఉండేలా ఒప్పించేందుకు ప్రయత్నించానని.. అయితే అందుకు ఆమె అంగీకరించలేదని తండ్రి కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు తమ ఎదుట హాజరుకావాలని ఇద్దరమ్మాయిలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత సదరు అమ్మాయి నిర్ణయం తీసుకునేందుకు కోర్టు గంటపాటు ఆలోచించుకునే సమయం ఇచ్చింది. అయితే ఆమె, తన స్నేహితురాలితోనే ఉంటానని నిర్ణయించుకుంది. అమ్మాయి పెద్దది..జీవితంలో తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది.