కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను తీవ్రం చేయడమే కాకుండా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ కేరళలో మాత్రం కరోనా కాంప్రమైజ్ కానంటోంది. తాజాగా కేరళలో 46,387 కొత్త కరోనా కేసులు రాగా, 15,388 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అలాగే గడిచిన 24 గంటల్లో 32 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో పాటు గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 62 ఒమిక్రాన్ కేసులు కేరళలో నమోదయ్యాయి. దీంతో కేరళలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 707 చేరుకుంది. ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 12,306 కరోనా కేసులు నమోదు కాగా, మరో 18,815 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో 43 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఢిల్లీ లో 68,730 కరోనా కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 21.48 శాతంగా ఉంది.