Site icon NTV Telugu

PM Modi: “సిగ్గులేదు, మీరు ఇంకెంత దిగజారుతారు”.. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: జనాభా నియంత్రణ గురించి బీహార్ అసెంబ్లీలో నిన్న సీఎం నితీష్ కుమార్ మాట్లాడటం వివాదాస్పదం అయ్యాయి. మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా నితీష్ వ్యవహరించడంపై పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో పాటు విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని ఈ రోజు సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు, వారి కూటమి ఇండియాను విమర్శించారు. మధ్యప్రదేశ్ లోని గుణాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అవమానించడమే అని ఆయన అన్నారు. ‘‘ ఇండియా కూటమిలో ఒక పెద్ద నాయకుడు (నితీష్ కుమార్) అసెంబ్లలో అసభ్య పదజాలం ఉపయోగించాడదు. వారికి సిగ్గులేదు. ఇండియా కూటమిలోని ఏ నాయకుడు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. మహిళల గురించి ఆలోచించే పద్దతి ఇదేనా..? వారు మీకు మంచి చేయగలారా..?’’ అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవారు మన దేశాన్ని అవమానిస్తున్నారు. మీరు ఎంత దిగజారిపోతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: K Annamalai: బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల ముందు ‘పెరియార్’ విగ్రహాలు తొలగిస్తాం..

నిన్న బీహార్ అసెంబ్లీలో కులగణనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న సమయంలో సీఎం నితీష్ కుమార్ జనాభా నియంత్రణ గురించి ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో సంతానోత్పత్తి రేటు 4.2 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోయిందని, లైంగిక సంపర్కం సమయంలో స్త్రీకి తమ భర్తలను ఎలా నిరోధించాలో వివరించారు. భర్తలు చేసిన చర్యలు మరన్ని జననాలకు దారి తీశాయని, అయితే చదువుకున్న మహిళలకు తమ భర్తలను ఎలా అడ్డుకోవాలో తెలుసని, అందుకే జననాలు తగ్గాయని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం వివాదంగా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది, ఇది జేడీయూ అసలు స్వరూపమని, 70 ఏళ్ల నితీష్ కుమార్ ని అడాల్ట్ పురుగులు కుట్టాయని విమర్శించింది. జాతీయ మహిళా కమిషన్ కూడా నితీష్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

Exit mobile version