Hydrogen train: భారత తొలి హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది..? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే..

  • భారత్ తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలుకు శ్రీకారం.
  • హైడ్రోజన్-ఆక్సిజన్ రసాయనిక చర్యతో విద్యుత్ ఉత్పత్తి.
  • పొగ, కార్బన్ ఉద్గారాలు లేకుండా నీటి ఆవిరి మాత్రమే విడుదల.
  • LFP బ్యాటరీ, రీజనరేటివ్ బ్రేకింగ్‌తో అధిక సామర్థ్యం.
Hydrogen Train

Hydrogen Train

Hydrogen train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య నడుస్తుంది. దీంతో హైడ్రోజన్ టెక్నాలజీ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనాల వద్ద మాత్రమే హైడ్రోజన్ రైల్ టెక్నాలజీ ఉంది. 10 కోచ్‌లు కలిగిన ఈ రైలు 89 కి.మీ మార్గంలో నడుస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన, శక్తివంతమైన రైలు ఇదే అని నిపుణులు చెబుతున్నారు.

ఎలా పనిచేస్తుంది.?

ఈ రైలులో హైడ్రోజన్ సిలిండర్లు నిల్వ చేసిన రెండు బోగీలు ఉంటాయి. హైడ్రోజన్ గ్యాస్‌ను హై ప్రెజర్ ట్యాంకుల్లో నిల్వ చేశారు. ఈ మొత్తం రైలులో అత్యంత కీలమైంది 1200 కిలోవాట్ల ప్రోటాన్ ఎక్స్‌చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్(PEMFC). దీంట్లోనే హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయనిక చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం చర్యలో బై ప్రొడక్ట్స్‌గా నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతుంది. పూర్తిగా ఎలాంటి కర్బన ఉద్గారాలు లేని క్లీన్ ఎనర్జీగా చెప్పవచ్చు.

ముందుగా హైడ్రోజన్ గ్యాస్ PEMFC సెల్‌లోకి చేరుతుంది. ఫ్లాటినం ఆధారిత క్యాటలిస్ట్ సాయంతో హైడ్రోజన్ అణువులు ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లుగా విడిపోతాయి. ఎలక్ట్రాన్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే సమయంలో బయట వాతావరణంలో ఉండే ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్‌లోకి ఎంటర్ అవుతుంది. హైడ్రోజన్ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లతో కలిసి నీటి ఆవిరి, హీట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా తయారైన విద్యుత్ లిథియం ఐరన్ ఫాస్పేట్(ఎల్ఎఫ్‌పీ) బ్యాటరీల్లో నిక్షిప్తం అవుతుంది. ఇది ఇంజన్‌కు అదనపు శక్తిని, యాక్సిలిరేషన్‌‌ను ఇస్తుంది. రైలు బ్రేకులు వేసిన సమయంలో ‘‘రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్’’ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్ మళ్లీ బ్యాటరీల్లో నిల్వ అవుతుంది.

హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రం ఏర్పాటు:

హర్యానాలోని జింద్‌లో దేశంలో అతిపెద్ద హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. NFPA-2, ISO 19880 అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు.

రైలు ప్రత్యేకతలు ఇవే:

ఈ రైలు 10 బోగీలను కలిగి ఉంటుంది. ఇందులో 2 హైడ్రోజన్ పవర్ కార్లు, 8 కోచ్‌లు ఉంటాయి. సుమారు 2600 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 75 కిలోమీటర్లు. నిజమైన వేగం గంటకు 110 కి.మీ ఉంటుంది. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో RDSO అభివృద్ధి చేసింది.