Heavy Rains Alert: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఢిల్లీ, ముంబయి మహానగరాల్లో వానల కారణంగా ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఉత్తర భారతంలో వర్షబీభత్సం కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ గంగోత్రి-యమునోత్రి నేషనల్ హైవేపై భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఆ జాతీయ రహదారి మూతపడింది. మనేరి, హెల్గుగాడ్, సయాంజ్ ప్రాంతాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
Read also: NARFBR Hyderabad Jobs: హైదరాబాద్ లో ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో భారీ వేతనాలు..
యుమునా నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి ఎగువనే కొనసాగుతోంది.. దీంతో ఐటీవో వారధిపై మరో గేటును తెరిచినట్లు దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఢిల్లీలో దాదాపు 26 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 18 వేల మందిని 47 పునరావాస కేంద్రాల్లో ఉంచారు. మరోవైపు ఆగ్రాలో యుమునా నది 45 ఏళ్లలో తొలిసారి తాజ్‌మహల్ గోడలను తాకింది. ఈ కట్టడం చుట్టుపక్కల ఉన్న తోటలు పూర్తిగా నీట మునిగాయి. ముంబయిలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. నిన్న ఒక్క రోజే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శాంతక్రజ్‌లో 109 మిల్లీమీటర్లు, కొలాబలో 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ప్రజలు 19, 20 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Read also: Property cheating: అట్లెట్లా నమ్మినావ్ బ్రో.. బిల్డింగ్ చూపిస్తే కోట్లు ఇచ్చేస్తావా..!
మహారాష్ట్ర, కర్ణాటకలోని బెళగావిలో భారీ వర్షాల కారణంగా ఆనకట్టలు వేగంగా నిండుతున్నాయి. ముఖ్యంగా కృష్ణానది, దాని ఉపనదుల్లో భారీగా నీరు చేరుతోంది. బెళగావిలో నాలుగు గంటల్లో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లాల్ బహదూర్ శాస్త్రి రిజర్వాయర్‌లోకి 13,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోందని అధికారులు పేర్కొన్నారు. కర్ణాటకలోని ఉడిపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. శివమొగ్గ, హసన్, కొడగు, బీదర్ తదితర జిల్లాలో గురువారం వరకు భారీ వర్ష సూచనలున్నాయి. అస్సాంలో పలు నదులు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. భూటాన్ నుంచి ఈ రాష్ట్రంలోని బక్సా, బార్పేట జిల్లాల నుంచి ప్రవహించే బెకి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గురు, శుక్రవారాల్లో అస్సాం, మేఘాలయ, మణిపుర్, నాగాలాండ్, మిజోరంలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉందంటూ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షపాతం కొనసాగుతుంటే మరికొన్ని చోట్ల అసాధారణ స్థాయిలో పొడి వాతావరణం ఉంది. ఉత్తర, నైరుతి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుంటే.. దక్షిణ ప్రాంతంలో పొడి వాతారణం నెలకొన్నట్లు ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మూడో వంతు భాగంలో సాధారణ వర్షపాతం ఉండగా.. 34 శాతం ప్రదేశాల్లో తక్కువ వానలు పడ్డాయి. ఇక 32 శాతం భూభాగంలో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది.