Bengaluru Rains: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు రోడ్లపైకి నీరు చేరింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ప్రభావం కారణంగా బెంగళూర్ లో పాటు కర్ణాటకలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు విధానసౌధ, ఆనంద్ రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లపై చెట్లు పడటంతో నుజ్జునుజ్జు అయ్యాయి.
శివానంద సర్కిల్ అండర్ పాస్ లో నీటిలో కారు మునిగిపోవడంతో ఒకరు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారులో ప్రయాణిస్తున్న సమయంలో అండర్ పాస్ లో నిలిచిన నీరు కారులోకి చేరింది. దీంతో భాను రేఖ(22) అనే యువతి ఊపిరాడక మరణించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుటుంబం సమ్మర్ హాలీడేస్ కావడంతో బెంగళూర్ చూసేందుకు వచ్చారు. గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్న సమయంలో అండర్ పాస్ లో నీటిలో కారు చిక్కుకుపోయింది. రక్షించే సమయానికి అపస్మారక స్థితిలో ఉన్న యువతిని సెయింట్ మార్తాస్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే యువతి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.