Maharashtra: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే నాశనమైపోతాం) అనే నినాదం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఈ నినాదం బీజేపీ కూటమిలో కూడా చిచ్చురేపుతోంది. బీజేపీ మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న అజిత్ పవార్ ఈ నినాదాన్ని వ్యతిరేకించాడు. ఇది జార్ఖండ్, యూపీ ప్రాంతాల్లో పనిచేస్తుందని కానీ, మహారాష్ట్రలో నినాదం పనిచేయదంటూ ఇటీవల వ్యాఖ్యానించారు.
అజిత్ పవార్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. ‘‘అజిత్ పవార్ దశాబ్ధాలుగా లౌకికవాద, హిందూ వ్యతిరేక భావజాలంతో ఉన్నాడు. సెక్యలరిస్టులుగా పిలుచుకునే వారులో నిజమైన సెక్యులరిజం లేదు. హిందుత్వను వ్యతిరేకించడం సెక్యలరిజమనే వ్యక్తులతో అతను ఉన్నాడు. ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు అతడికి కొంత సమయం పడుతుంది’’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ వ్యక్తులు ప్రజల సెంటిమెంట్లు అర్థం చేసుకోలేదు, వారికి ప్రకటన యొక్క అర్థాన్ని తెలుసుకోలేరు, వారు వేరే ఏదైనా చెప్పాలనుకుంటున్నారు అని ఆయన అన్నారు.
Read Also: Narayana Murthy: ఐటీ ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేయాల్సిందే.. ఇన్ఫోసిస్ అధినేత కీలక వ్యాఖ్యలు
అజిత్ పవార్‌తో పాటు బీజేపీ నేతలు పంకాజా ముండే, అశోక్ చవాన్ కూడా ఈ నినాదంపై పెదవివిరిచారు. దివంగత బీజేపీ అగ్రనేత గోపీనాథ్ ముండే కుమార్తె శ్రీమతి ముండే మాట్లాడుతూ.. ‘‘తన రాజకీయాలు భిన్నమైనవని, ఒకే పార్టీకి చెందినప్పటికీ దీనికి మద్దతు ఇవ్వబోనని అన్నారు. ప్రతీ మనిషిని ఏకం చేయడమే నాయకుడి పని కాబట్టి, మేము మహారాష్ట్రకు అలాంటి టాపిక్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ నినాదం ఇటీవల హర్యానా ఎన్నికల్లో బలంగా పనిచేసింది. హిందువులు అంతా ఐక్యంగా ఉండాలన్నదే ఆ నినాదం అర్థం, విడిపోతే నాశనం అవుతామని బంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితిని గురించి వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న ‘‘కులగణన’’ అనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ (కలిసి ఉంటేనే సేఫ్) అని మరో నినాదం లేవనెత్తారు. మహారాష్ట్రలోని 288 స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.