Jyoti Malhotra: సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్. మంచిగానే ఆదాయం వస్తూ ఉంటుంది. అయినా కూడా, హర్యానాకు చెందిన యూట్యూబర్ శత్రుదేశం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికిపోయింది. ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఆరుగురిని గూఢచర్యం చేస్తున్న కారణంగా ఈ రోజు అరెస్ట్ చేశారు. హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో ప్రముఖ యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్న జ్యోతి మల్హోత్రా ఈ వ్యవహారంలో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.
Read Also: Pakistan: మాకు “సింధుదేశ్” కావాలి.. పాకిస్తాన్‌లో మరో దేశం కోసం డిమాండ్..
జ్యోతి మల్హోత్రాకు ‘‘ట్రావెల్ విత్ జో’’ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీనికి 3,77,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, ‘ట్రావెల్ విత్ జో’1’ కు కూడా 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన డిస్‌క్రిప్షన్‌లో ‘‘నోమాడిక్ లియో గర్ల్. వాండరర్ హర్యాన్వి + పంజాబీ మోడ్రన్ గర్ల్ విత్ ఓల్డ్ ఐడియాస్’’ అని రాసుకుంది. ఈమె భారత్‌తో పాటు ఇండోనేషియా, చైనా వంటి వివిధ దేశాల్లో విస్తృతంగా పర్యటించింది.
అయితే, ఆమె పాకిస్తాన్ పర్యటన మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈమె పాకిస్తాన్ అంతటా పర్యటించి అక్కడి వీడియోలను పోస్ట్ చేసింది. లాహోర్ అనార్కలి బజార్, పాకిస్తాన్‌లోని అతిపెద్ద హిందూ ఆలయం కటాస్ రాజ్‌ని సందర్శించిన వీడియోలు ఉన్నాయి. ఆమె ఇన్ స్టా హ్యాండిల్‌లోని ఒక ఫోటోకి ఉర్దూలో ‘‘ఇష్క్ లాహోర్’’ అనే క్యాప్షన్ కూడా ఉంది. జ్యోతి మల్హో్త్రా గత సంవత్సరం కాశ్మీర్‌లో సందర్శించింది. ఆమె తన తాజా వీడియోలో ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’ గురించి మాట్లాడింది. ‘‘పహల్గామ్ కాశ్మీర్‌పై నా అభిప్రాయం: మనం మళ్లీ కాశ్మీర్ సందర్శించాలా..?’’ అని వీడియో క్యాప్షన్ పెట్టింది. రెండు సార్లు పాకిస్తాన్ వెళ్లిన జ్యోతి, అక్కడి నిఘా అధికారులు, భద్రతా అధికారులతో సమావేశమైనట్లు అధికారుల ముందు ఒప్పుకుంది. పాక్ హైకమిషన్ అధికారితో పాటు పాక్‌లో పలువురితో నిత్యం టచ్‌లో ఉన్నట్లు చెప్పింది.