Election Commission: ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ సంచలన విషయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను గెలుచుకుని మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి కాంగ్రెస్ 37 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది. హర్యానా ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఓటమితో ఢీలా పడిపోయింది. ఫలితాలకు ముందు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. తీరా ఫలితాల వెల్లడి తర్వాత కాంగ్రెస్ పరాజయం ఖాయమైంది.
Read Also: Bomb threats: 32 ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు..
అయితే, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఫలితాలను తాము ఒప్పుకోవడం లేదని ఆ పార్టీ చెప్పింది. అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారు. ఇదిలా ఉంటే, తాజాగా ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై స్పందించింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అన్నీ కూడా ‘‘నిరాధారమైనవి’’ అని భారత ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో నిరాధారమైన ఫిర్యాదులు చేయవద్దని, ప్రజల్లో అశాంతిని సృష్టించొద్దని సూచించింది. ఇలాంటి అనవసరమైన ఆరోపణలు అల్లకల్లోలానికి దారి తీస్తాయని, సామాజిక వ్యవస్థకు భంగం కలిగిస్తాయని హెచ్చరించింది.