Honey Trap: భారతదేశ రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హనీట్రాప్ ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే డీఆర్డీఓలో పనిచేస్తున్న ఓ సైంటిస్టు సున్నితమైన భారత మిస్సైల్ రహస్యాలను ఓ పాకిస్తాన్ మహిళా ఏజెంట్ లో పంచుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది.
గుజరాత్‌లోని భుజ్‌లో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) కాంట్రాక్టు ఉద్యోగిని పాకిస్తాన్ మహిళా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌తో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితుడు నీలేష్ బలియా గత ఐదేళ్లుగా భుజ్‌లోని బిఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. ఇతను పాకిస్తాన్ మహిళా ఏజెంట్ వలుపువలలో చిక్కుకున్నాడు. పాక్ ఏజెంట్ కు వాట్సాప్ ద్వారా సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) సదరు బీఎస్ఎఫ్ ఉద్యోగిని శుక్రవారం అతడిని అరెస్ట్ చేసింది.
Read Also: Sudan: సూడాన్‌లో వైమానిక దాడులు.. 22 మంది మృతి
పోలీస్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. నీలేష్ జనవరి 2023లో అదితి తివారీ అనే పేరులో పాకిస్తాన్ కు చెందిన ఏజెంట్ పరిచమైంది. వాట్సాప్ ద్వారా నీలేష్ తో పరిచయం పెంచుకున్న మహిళ, ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా నటిస్తూ అతడిని లోబరుచుకుంది. నిర్మాణంలో ఉన్న బీఎస్ఎఫ్ భవనాల్లో విద్యుదీకరణ పనులకు సంబంధించి సున్నిత సమాచారాన్ని, సివిల్ డిపార్ట్మెంట్ పత్రాలను పంచుకున్నాడు. నీలేష్ ఇలా చేసినందుకు రూ. 28,000 యూపీఐ ద్వారా అందుకున్నాడు. ఇతడి కదలికలపై అనుమానం రావడంతో అతడి ఫోన్ రికార్డులు, వాట్సాప్ హిస్టరీ, బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు నీలేష్ పై నేరపూరిత కుట్ర, అధికారిక రహస్యాల చట్టం కింద ఐపీసీ సెక్షన్ 121, సెక్షన్ 120-బి కింద కేసులు నమోదు చేశారు.