NTV Telugu Site icon

Mamata Banerjee: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ఆగ్రహం.. దౌత్యపరంగా నిరసన..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్లను ఉద్దేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తన నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలియజేసినట్లు విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పింది. “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్ వైపు నుండి మాకు దౌత్యపరమైన నోట్ అందిందని నేను ధృవీకరించగలను” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం తెలిపారు. విదేశీ వ్యవహారాలు కేంద్రం పరిధిలోకి వచ్చే అంశమని ఆయన చెప్పారు.

Read Also: Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌కు భారత మహిళల ఆర్చరీ జట్టు..

జూలై 21న కోల్‌కతాలో జరిగిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ..బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆశ్రయం కోరే బంగ్లాదేశీయులకు బెంగాల్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుందని ఆమె అన్నారు. హింస నుంచి వచ్చే శరణార్థులను, పొరుగు దేశాల వారిని గౌరవించాలని, వారికి వసతి కల్పించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం ఉందని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.

మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు రెచ్చగోట్టేవిగా, అసమర్థమైనవిగా అభివర్ణించింది. హింసాత్మక పరిస్థితుల్ని చక్కదిద్దతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించింది. ఇటీవల బంగ్లాదేశ్ వ్యాప్తంగా రిజర్వేషన్లపై భారీ నిరసనలు జరిగాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. వీటిలో 150 మందికి పైగా మరణించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ, అక్కడి విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు.