NTV Telugu Site icon

Giriraj Singh: గాడ్సే ఈ దేశ పుత్రుడు.. ఔరంగజేబులా ఆక్రమణదారు కాదు.. ఓవైసీకి కేంద్రమంత్రి కౌంటర్

Giriraj Singh

Giriraj Singh

Giriraj Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విరుచుకుపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర కొల్హాపూర్ ఘర్షణ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓవైసీ విమర్శలు గుప్పించారు. ‘ఔరంగజేబు సంతానం’ అంటూ ఫడ్నవీస్ కామెంట్స్ పై ఓవైసీ ‘గాడ్సే’ సంతానం ఎవరంటూ ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై గిరిరాజ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.

నాథూరామ్ గాడ్సేను భారతదేశ విలువైన పుత్రుడు(సుపుత్)గా గిరిరాజ్ సింగ్ అభివర్ణించారు. గాడ్సే, గాంధీని చంపినప్పటికీ, ఈ దేశ పుత్రుడు, ఈ దేశంలోనే పుట్టాడని.. బాబార్, ఔరంగజేబులా ఆక్రమణదారు కాదని వ్యాఖ్యానించారు. బాబర్ కుమారులుగా పిలువబడే వారు భారతమాత కుమారులు కాలేరని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: NCP: అజిత్ పవార్‌కి చెక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్..

టిప్పుసుల్తాన్, ఔరంగజేబులకు అనుకూలంగా ఓ వర్గం వ్యక్తులు సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనపై స్పందించిన ఆ రాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. కొందరు ఔరంగజేబు సంతానం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నారని, వారు ఎక్కడ నుంచి వచ్చారో.. విచారణలో తేలుస్తామంటూ వ్యాఖ్యానించారు.

దీనికి ప్రతిగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. దేవేంద్ర ఫడ్నవీస్ ‘ఔరంగజేబు సంతానం’’ అంటున్నారు.. ఈ విషయంలో మీరు అంత నిపుణులా.. అయితే గాడ్సే, ఆప్టేల సంతానం ఎవరో కూడా తెలుసుకోవాలి అని విమర్శించారు. ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యలు మతపరమైనవిగా చెప్పారు. జాతిపితను చంపిన వ్యక్తిని ప్రశంసించారని.. అతను మొఘల్ చక్రవర్తులను భారత్ కు వ్యతిరేకమైన మనుషులుగా పిలిచారని అన్నారు.

Show comments