GoAir flights emergency landing: దేశంలోొ వరసగా విమానాలు సాంకేతిక లోపాలకు గురవుతున్నాయి. ఆదివారం రోజు రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తాజాగా గో ఎయిర్ సంస్థకు సంబంధించిన రెండు విమానాల్లో కూడా సాంకేతిక లోపాలు తలెత్తడంతో వీటిని దారి మళ్లించి సమీప విమానాశ్రయాల్లో ల్యాండింగ్ చేశారు. మంగళవారం ముంబై నుంచి లేహ్ వెళ్తున్న గో ఎయిర్ ఏ320 వీటీడబ్ల్యూజీఏ విమానంలో ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తతెత్తడంతో ఢిల్లీకి మళ్లించారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న మరో గో ఎయిర్ ఏ 320 డబ్ల్యూజేజీ విమానంలో కూడా ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి శ్రీనగర్ విమానాశ్రయానికి మళ్లించారు.
ఈ ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింవది. గత నెల కాలం నుంచి వరసగా భారతీయ విమాన సంస్థలకు సంబంధించిన పలు విమానాలలో సాంకేతిక లోపాలు సంభవించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ముఖ్యంగా స్పైస్ జెట్ కు సంబంధించిన పలు విమానాలు సాంకేతిక లోపాలకు గురయ్యాయి. వీటిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇటీవల పలు విమానాలకు సంబంధించి సాంకేతిక లోపాల రావడంతో కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, భద్రతా పర్యవేక్షణపై డీజీసీఏ అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు.
Read Also: Governor Tamilisai: క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
గడిచిన ఆదివారం కూడా రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో సాంకేతిక లోపాలు రావడంతో వీటిని ఎమర్జెన్సీ ల్యాండిాంగ్ చేశారు. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పాకిస్తాన్ కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదే రోజు కాలికట్ నుంచి దుబాయ్ ఎళ్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానంలో సమస్య ఏర్పడటంతో దీన్ని ఒమన్ దేశం మస్కల్ లో ల్యాండ్ చేశారు. ఇదే విధంగా జూన్ 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో కూడా సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.