Giriraj Singh: బీహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష నేతలు కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. జనవరి 10న బెగుసరాయ్ జిల్లాలోని బచ్వారాలో జరిగిన సమావేశానికి బీహార్ పశుసంవర్ధక మంత్రి, బచ్వార ఎమ్మెల్యే సురేంద్ర మెహతా నిర్వహించారు. గిరిరాజ్ సింగ్ సహా సీనియర్ NDA నాయకులు హాజరయ్యారు.
Read Also: Iran: ఉరిశిక్షలతో అణచివేత.. 26 ఏళ్ల నిరసనకారుడికి ఇరాన్ మరణశిక్ష..
సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన గిరిరాజ్ సింగ్.. ‘‘ పందుల్ని ఏర్పాటు చేస్తే, పందులు ఉన్న చోటుకు వాళ్లు రారు’’ అని అన్నారు. ఏ వర్గం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకున్నా, ఇస్లాంలో పంది నిషేధమైన జంతువు కావడంతో ఈ వ్యాఖ్య ముస్లింలను లక్ష్యంగా చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆర్జేడీ నేత మోహిత్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇలాంటి ప్రకటనలు సామాజిక సామరస్యానికి హానికరమని చెప్పారు. పూర్ణియా ఎంపీ పప్పూ యాదవ్ కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. రెచ్చగొట్టే ఆరోపణలు చేశారని అన్నారు.