Site icon NTV Telugu

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, ఆయన భార్యకు పాక్‌తో సంబంధాలు.. సీఎం సంచలన ఆరోపణలు..

Himanta

Himanta

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్‌పై, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపణల తీవ్రతను పెంచారు. ఆయనకు, ఆయన భార్యకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్‌లపై కేంద్రం దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని అన్నారు. గొగోయ్ భార్య పాకిస్తాన్‌కు భారత రహస్య సమాచారాన్ని ఇచ్చిందని హిమంత ఆరోపించారు.

అసలు కేసు ఏమిటి..?

ఈ కేసు గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్‌కు పాకిస్థాన్‌తో, ముఖ్యంగా పాక్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలకు సంబంధించింది. ఆమె పాకిస్తాన్‌ ప్రణాళిక సంఘం మాజీ సలహాదారు తౌకీర్ షేక్ వద్ద ఇస్లామాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు ఈ సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. ఈ ఆరోపణల్ని దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. సిట్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కేసు సున్నితత్వం దృష్ట్యా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని సీఎం హిమంత నిర్ణయించారు.

సంచలన ఆరోపణలు:

గౌరవ్ గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్‌లకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. పాకిస్తాన్ కు చెందిన లీడ్ పాకిస్తాన్ నుంచి ఆమె జీతం కూడా తీసుకునేదని సీఎం వెల్లడించారు. ఎంపీ భార్యను పాక్ నియంత్రిస్తోందని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. ఎలిజబెత్ గతంలో యూఎస్ మాజీ సెనెటర్ టామ్ ఉడాల్, బిలియనీర్ జార్జ్ సోరోస్‌కు సహాయకురాలిగా పనిచేశారని అన్నారు.

గొగోయ్ భార్య లో-ప్రొఫైల్ మెంటైన్ చేయడానికి పాకిస్తాన్‌లోకి అటారీ సరిహద్దు గుండా వెళ్లారని హిమంత చెప్పారు. గొగోయ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె 9 సార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. గొగోయ్ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కూడా పాకిస్తాన్ సంస్థకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. 2013లో పాక్ పర్యటనలో గొగోయ్, ఆయన భార్య లాహోర్‌కు వెళ్లడానికి మాత్రమే అనుమతించారని, కానీ తర్వాత వారు ఇస్లామాబాద్, కరాచీ కూడా వెళ్లడానికి అనుమతించారని, దీని కోసం గొగోయ్ ఈవీసా కోరాడని సీఎం చెప్పారు.

గొగోయ్ తన మైనర్ కుమారుడి కోసం బ్రిటిష్ పౌరసత్వం ఇప్పించడానికి 2022లో ఢిల్లీ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో అతడి పాస్‌పోర్టు అప్పగించారని హిమంత ఆరోపించారు. గౌరవ్ గొగోయ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడిని, ఈ విషయాన్ని పరిశీలించి సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.

అయితే, ఈ ఆరోపణలపై గౌరవ్ గొగోయ్ స్పందించారు. ‘‘సూపర్ ప్లాన్’’ అంటూ ఆన్‌లైన్ పోస్ట్ పెట్టారు. హిమంత మీడియా సమావేశం సీ-గ్రేడ్ సినిమా కన్నా దారుణంగా ఉందని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అత్యంత తెలివితక్కువ, నిరాధారమైన విషయాలని అన్నారు.

Exit mobile version