జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం కలిగింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్(81) తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శిబు సోరెన్ నెల రోజులకు పైగా దేశ రాజధాని ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన ఆస్పత్రిలో ప్రాణాలు వదిలారు. సోబు సోరెన్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక జార్ఖండ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
శిబు సోరెన్..
శిబు సోరెన్.. సీనియర్ పొలిటీషియన్. దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందారు. 2005లో 10 రోజుల పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అనంతరం 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు ఇలా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇక మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రికి తప్పిన విమానం ప్రమాదం.. పైలట్ ఏం చేశాడంటే..!
1944, జనవరి 11న శిబు సోరెన్ జన్మించారు. భార్య పేరు రూపి సోరెన్. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. హేమంత్ సోరెన్, దుర్గా సోరెన్, బసంత్ సోరెన్, కుమార్తె అంజలీ సోరెన్ సంతానం. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 1995 నుంచి 2005 వరకు జామా నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ జామ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. బసంత్ సోరెన్ జార్ఖండ్ యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేస్తూ దుమ్కా నుంచి 2020లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
