పులిని చంపేందుకు ప్రైవేట్ షూటర్లను ఏర్పాటు చేసిన అటవీ శాఖ
ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఒక చిరుతపులి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అడవి నుంచి బయటకు వచ్చిన ఈ చిరుత గ్రామాల్లో తిరుగుతూ, గత వారం రోజులుగా వరుస దాడులు చేసింది. దీంతో అటవీ అధికారులు దానిని అధికారికంగా ‘నరభక్షక చిరుత’గా ప్రకటించారు. ఈ ఘటన పౌరీ జిల్లా గజాల్డ్ గ్రామ పరిసరాల్లో చోటు చేసుకుంది.
చిరుతపులిని చంపేందుకు పౌరిలో అటవీ శాఖ ఇద్దరు ప్రైవేట్ షూటర్లను నియమించింది. ఇప్పటివరకు సమస్యాత్మక వన్యప్రాణులను నిర్మూలించే హక్కు అటవీ అధికారులకే ఉన్నప్పటికీ, పరిస్థితి మరింత దిగజారడంతో ఈసారి షూటర్లను ప్రత్యేకంగా నియమించారు.
అయితే..బుధవారం పౌరీలోని పోఖ్రా బ్లాక్‌లో గడ్డి కోస్తున్న కాంచన్ దేవి అనే మహిళపై చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఆమె కేకలు వినిన ఇద్దరు గ్రామస్తులు రాళ్లు విసరడంతో చిరుత వెనక్కి తగ్గింది. అనంతరం కాంచన్ దేవిని హెలికాప్టర్ ద్వారా రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.
అంతకుముందు గజాల్డ్ గ్రామంలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాజేంద్ర నౌటియాల్ కుటుంబాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ (అటవీ) ఆర్.కె. సుధాన్షు, గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే పరామర్శించారు. అధికారులు గ్రామస్తులతో మాట్లాడుతున్న సమయంలో అదే ప్రాంతంలోని మరొక కుటుంబానికి చెందిన పశువులపై కూడా చిరుత దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ప్రాంతంలో భయాందోళనలు మరింత పెరిగాయి.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు, పౌరీ గర్హ్వాల్‌కు చెందిన జయ్ హుకిల్ రాకేష్ చంద్ర బద్వాల్ అనే ఇద్దరు ప్రైవేట్ షూటర్లను అటవీ బృందాలతో కలిసి పనిచేసేలా అధికారికంగా నియమించి, నరభక్షక చిరుతను చంపే బాధ్యతలను వారికి అప్పగించారు.