Site icon NTV Telugu

Assam Floods: వరదలతో అసోం విలవిల.. 8 మంది మృతి

Floods

Floods

గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం అసోంను కుంగదీస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత వరదల కారణంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 11 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మానస్, పగ్లాదియా, పుతిమరి, కొపిలి, గౌరంగ్, బ్రహ్మపుత్ర నదుల నీటిమట్టం కూడా అసోంలోని పలు చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది.

గోల్‌పరా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. దిమా హసావో, ఉదల్‌గురి జిల్లాల్లో వరద నీటిలో ఇద్దరు మునిగిపోవడంతో గురువారం నాటికి రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 15 ప్రభావిత జిల్లాలకు చెందిన 68,331 మంది ఆయా జిల్లాల యంత్రాంగం ఏర్పాటు చేసిన 150 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లోని 19782.80 హెక్టార్ల పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి.

రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 72 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 1,510 గ్రామాలు ప్రస్తుతం నీటిలో ఉన్నాయి. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా కామరూప్‌ మెట్రోపాలిటన్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు శుక్రవారం మూసివేయబడ్డాయి. అసోంలోని రంగియా డివిజన్‌లోని నల్బారి-ఘోగ్రాపర్‌ మధ్య నీరు నిలిచిపోవడంతో, ఈశాన్య సరిహద్దు రైల్వే అనేక రైళ్ల సేవలను రద్దు చేసి, పాక్షికంగా రద్దు చేసి, దారి మళ్లించినట్లు ఈశాన్య చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్వో) తెలియజేశారు. రాష్ట్రంలోని మొత్తం 1,702 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారడంతో అసోం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ.

Agnipath protest: అగ్నిపథ్‌ ఆందోళన ఎఫెక్ట్‌.. నిలిచిపోయిన హైదరాబాద్‌ మెట్రో..

“ఈసారి మాత్రమే కాదు, వరదలు ప్రతిసారీ మమ్మల్ని నాశనం చేస్తున్నాయి, కానీ దానికి పరిష్కారం లేదు. మేం సహాయక శిబిరాల్లోఉండాల్సిందే. కానీ ఇక్కడి నుంచి వెళితే మా పశువులను ఎవరు చూసుకుంటారు” అని నల్బరిలో ఓ వరద బాధిత గ్రామస్థుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Exit mobile version