Census: దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కింపు’’పై కేంద్రం చర్యల్ని వేగవంతం చేసింది. తొలి దశలో దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లను లెక్కించి, జాబితా చేయనున్నారు. ఈ గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని, ఇది జనాభా లెక్కింపు మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుందని భారత రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు జనాభా లెక్కల కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ లేఖ రాశారు. దీంట్లో గృహాల జాబితా కార్యకలాపాలు, గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. దీనికి ముందు పర్యవేక్షకులు, ఎన్యూమిరేటర్స్ నియామకం జరగనుంది. రాష్ట్రాలు, జిల్లా పరిపాలన సహకారంతో వీరికి పని విభజన జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.
Read Also: Minister Nara Lokesh: “ఇంటింటికీ టీడీపీ”.. ప్రజాప్రతినిధులకు నారా లోకేష్ కీలక ఆదేశాలు..
జనాభా లెక్కింపు రెండు దశలుగా జరగనుంది. మొదటి దశలో గృహాల జాబితా ఆపరేషన్(HLO), ప్రతీ ఇంటి పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల వంటి వివరాలను సేకరిస్తారు. తర్వాత రెండో దశలో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి యొక్క జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక మరియు ఇతర వివరాలను సేకరించనున్నారు, ఇది ఫిబ్రవరి 1, 2027న జరగాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. జనాభా గణనలో, కుల గణన కూడా జరుగుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
జనాభా గణన కార్యకలాపాల కోసం, 34 లక్షలకు పైగా గణనదారులు మరియు పర్యవేక్షకులు మరియు సుమారు 1.3 లక్షల జనాభా గణన కార్యకర్తలను నియమించనున్నారు. ఇది 16వ జనాభా గణన అవుతుంది. స్వాతంత్య్రం తర్వాత ఇది 8వది. రాబోయే జనాభా గణనను మొబైల్ అప్లికేషన్‌లను ఉపయోగించి డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తారు. స్వీయ గణనను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం ప్రజలను అడగడానికి దాదాపు 3 డజన్ల ప్రశ్నల్ని సిద్ధం చేసింది. ఈ సర్వేలో గృహాలను ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, కారు, జీప్, వ్యాన్), ఉపకరణాలు (రేడియో, టీవీ, ట్రాన్సిస్టర్) వంటి వాటి గురించి అడుగుతారు. తాగు నీరు, లైటింగ్, మరుగుదొడ్లు, మురుగునీటి సౌకర్యాలు, వంటగది, ఎల్పీజీ కనెక్షన్ గురించి అడుగుతారు. ఇంటి ఫ్లోర్, పైకప్పుకు ఉపయోగించిన పదార్థాలు, దాని పరిస్థితి, నివాసితుల సంఖ్య, గదుల సంఖ్య, వివాహ స్థితి, ఇంటి యజమాని స్త్రీ నా లేదా ఎస్సీ, ఎస్టీకి చెందిన వారా..? అనే అదనపు ప్రశ్నలు ఉంటాయి.