అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు ముదిరింది. పార్టీ అధినేత పదవి కోసం మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్ లీడర్‌షిప్ ప్రతిపాదనపై ఈరోజు అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి ముందే చెన్నైలో పన్నీర్, పళని వర్గాల నేతలు రోడ్డుపైనే కొట్టుకున్నారు. అంతేకాకుండా చెన్నైలోని అన్నా డీఎంకే ఆఫీసులోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టారు. జయలలిత కట్టించిన ఈ ఆఫీస్‌లో ఈరోజు పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు కొట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అన్నాడీఎంకే పార్టీలో ఇన్నాళ్లూ జోడు పదవులు ఉంటాయని సాగిన ప్రచారం ఏకనాయకత్వంపైకి మళ్లడంతో ఆ పదవిని తామే సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల నేతలు ఎవరికి వారు ఎత్తులు, ఎత్తులకు పైయెత్తులు వేస్తూ పావులు కదుపుతున్నారు. అమ్మ ఆశీస్సులు తమకే ఉన్నాయని తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల నేతలు పోస్టర్లు కూడా అంటించుకున్నారు.