Op Sindoor 2.0: పాకిస్తాన్‌ను ‘‘ ఆపరేషన్ సిందూర్ ’’ దాడులు భయపెడుతూనే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ తీవ్రస్థాయిలో దాయాదిపై విరుచుకుపడింది. ఆనాటి దాడులు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ భయపడేలా చేస్తున్నాయి. తాజాగా, ఆపరేషన్ సిందూర్ 2.0 దాడులు జరుగుతాయనే భయంతో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(LOC) వెంబడి ఆయుధాలను మోహరిస్తోంది. ఎల్ఓసీ, పాక్ ఆక్రమితక కాశ్మీర్(పీఓకే) ప్రాంతాల్లో కౌంటర్ డ్రోన్ మోహరింపుల్ని గణనీయంగా పెంచింది. కౌంటర్ అన్ మ్యాన్డ్ ఎరియల్ సిస్టమ్స్(C-UAS)ను సరిహద్దుల్లోని రావాల్కోట్, కోట్లి, భీంబర్ సెక్టార్‌లలో మోహరించింది. ఎల్ఓసీ వెంబడి 30కి పైగా ప్రత్యేక యాంటీ డ్రోన్ యూనిట్లను మోహరించింది.
Read Also: Transfers : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
ఈ మోహరింపులు ముర్రీలోని ప్రధాన కార్యాలయం ఉన్న 12వ ఇన్‌ఫెంట్రీ డివిజన్‌తో పాటు, కోట్లి–భింబర్ వెంట బ్రిగేడ్లను నియంత్రించే 23వ ఇన్‌ఫెంట్రీ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎల్ఓసీనికి దగ్గరగా వైమానిక నిఘా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌ను బలోపేతం చేయడానికి ఈ చర్యల్ని పాకిస్తాన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సెక్టార్ల వారీగా చూస్తే, రావల్‌కోట్‌లోని యాంటీ డ్రోన్ అసెట్స్‌ను ప్రధానంగా 2వ ఆజాద్ కాశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తుంది. ఇది భారత్‌లోని పూంచ్ సెక్టార్ కు ఎదురుగా ఉంటుంది. కోట్లీలో మోహరించి భారత్ లోని రాజౌరి, పూంచ్, నౌషేరా, సుందర్‌బానీ సెక్టార్లకు ఎదురుగా ఉంటుంది.
ఈ “సాఫ్ట్-కిల్” చర్యలతో పాటు, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా మోహరించింది. వీటిలో రాడార్ గైడెడ్ వ్యవస్థల సపోర్ట్ కలిగిన ఓర్లికాన్ GDF 35 మిమీ ట్విన్-బారెల్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, అలాగే నెమ్మదిగా, తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను ఛేదించగల అంజా Mk-II, Mk-III మాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (MANPADS) ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ గగనతలం ఎంత వీక్‌గా ఉందనే విషయాన్ని ఆ దేశం గుర్తించింది. దీంతో ఈ లోపాలను పూడ్చేందుకు కొత్త డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థల్ని సేకరించేందుకు పాకిస్తాన్ టర్కీ, చైనాలతో చర్చలు జరుపుతోందని సమాచారం.
