కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఆరు నెలలుగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ, కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోలేదు. ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి తీవ్రతరం కావడంతో రైతులు ఢిల్లీని వదిలి వెనక్కి వెళ్లారు. అయితే, ఈ నెల 26 వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని భారత్ కిసాన్ యూనియన్, కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హర్యానా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకునేందుకు బయలుదేరి వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల్లో వారం రోజులపాటు సామూహిక భోజన కార్యక్రమాలు చేపట్టాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఆందోళనతో కేసులు పెరిగాయని అప్పట్లో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల పేరుతో సభలు, సమావేశాలు నిర్వహించారని, వారి వలనే కరోనా కేసులు పెరిగాయని రైతు నాయకులు చెప్తున్నారు.