కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్య పద్ధతిలో ఆమోదించుకున్న “మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు” రద్దు చేయాలని, కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై నేటికి ఆరు నెలలు పూర్తయింది.
ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పట్ల మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ, “సంయుక్త కిసాన్ మోర్చా” మే 26 వ తేదీన “బ్లాక్ డే” నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు వాహనాలతో పాటు, ఇళ్లపైన, కార్యాలయాలపైన, నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని రైతు సంఘాల పిలుపునిచ్చాయి. ప్రజా సంఘాల నుంచి రాజకీయ పార్టీల వరకు అన్ని వర్గాల నుంచి రైతు సంఘాల పిలుపు కు మద్దతు లభిస్తుంది. “బ్లాక్ డే” కు మద్దతుగా ఆన్‌లైన్ లో విస్తృత ప్రచారం జరుగుతుంది.
“కరోనా” విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రైతు సంఘాల ఉద్యమ శైలి మారింది. ప్రజల మద్దతు కూడగట్టేందుకు “ఆన్‌లైన్” లో రైతు సంఘాలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. దాంతో “బ్లాక్ డే” పిలుపు ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేరుకుంది.
ఈ సందర్భంగా, నేడు జరిగే నిరసన కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా వేలాది ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజలు భాగస్వామ్యం అయ్యేట్లు ఏర్పాట్లు చేసుకున్నాయి రైతు సంఘాలు. ఆయా రాష్ట్రాలలో ఎక్కడికక్కడే వేలాది నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేసేందుకు స్థానిక రైతు సంఘాల నేతలు ఏర్పాట్లు చేసారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గ్రామాల్లో నల్ల జెండాలను స్వయంగా కుట్టి ఆందోళన చేస్తున్న రైతులకు పంపారు మహిళలు.
అయితే రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేతలు నల్ల జెండాలతో పలు వేదికల వద్ద నిరసన ప్రదర్శనలు చేయనున్నారు. ఇక రైతులకు మద్దతు తెలిపారు రైల్వే ఉద్యోగులు. రైతుల “బ్లాక్ డే”కు సంఘీభావంగా, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు పిలుపునిచ్చారు.“పెన్షన్ స్కీమ్” ను పునరుద్ధరించాలని, “కరోనా” బీమా కల్పించాలని, ప్రైవేటీకరణ ను ఆపాలని, పెండింగ్ డిఎ చెల్లించాలన్న పలు డిమాండ్ల సాధనకై ఉద్యమించాలని రైల్వే ఉద్యోగుల సంఘం నిర్ణయం తీసుకుంది.