Karnataka: కర్ణాటకలో ఘన విజయం సాధించినా..కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి సతమతం అవుతోంది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా పదవిని ఆశిస్తుండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే బుధవారం సీఎం ఎంపికపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ తో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ హామీ మేరకు డీకే శివకుమార్ మెత్తబడినట్లు సమాచారం.
Read Also: Work From Home: “వర్క్ ఫ్రం హోం” అనైతికం.. బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందన
సీనియారిటీ, క్లీన్ ఇమేజ్ కారణంగా కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోగా అధికారిక ప్రకటిన వస్తుందని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నా తెలియజేస్తామని, మరో 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేస్తామని కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణదీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు.
ఎన్నాళ్ల నుంచో విజయం కోసం వేచి చూస్తున్న కాంగ్రెస్ కు కర్ణాటకలో భారీ విజయం ఊరటనిచ్చింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 135 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 66, జేడీయూ 19 స్థానాలకే పరిమితం అయింది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు ఈ విజయం మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్ తో ఈ ఎన్నికల్లో కూడా బీజేపీపై దూకుడుగా కాంగ్రెస్ పోరాడే అవకాశం వచ్చింది.