ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది… ఎల్లుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా… అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేస్తూ వస్తున్నాయి పలు రాష్ట్రాల పీసీసీలు.. కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ 23.. అయితే, దేశవ్యాప్తంగా వరుస ఓటములు.. సీనియర్లు, కీలక నేతల రాజీనామాల నేపథ్యంలో.. ఏఐసీసీ పీఠానికి జరగనున్న ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది.
Read Also: Nandamuri Balakrishna: సత్తి రెడ్డి.. ‘చెన్నకేశవరెడ్డి’ మళ్లీ వస్తున్నాడు.. సిద్దమేనా..?
అయితే, 1998 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘ కాలం సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ వచ్చారు.. మధ్యలో అంటే.. 2017లో రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించినా.. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత బాధ్యతల నుంచి తప్పుకున్నారు రాహుల్.. దీంతో.. మళ్లీ సోనియానే పగ్గాలు తీసుకున్నారు.. సుదీర్ఘ కసరత్తుల తర్వాత అధ్యక్ష ఎన్నికలకు సిద్ధం అవుతోంది పార్టీ.. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19న కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు.. దీంతో, బరిలోకి దిగేది ఎవరు? ఆ అవకాశం ఉందా? వరుసగా కొన్ని రాష్ట్రాల పీసీసీలు.. రాహుల్‌నే పార్టీ చీఫ్‌ను చేయాలంటూ తీర్మానాలు చేస్తున్న తరుణంలో.. ఏం జరగబోతోంది? అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. మరో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కూడా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో సోనియాగాంధీతో శశిథరూర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ‌్యక్ష ఎన్నికల్లో పోటీ కోసమే ఆయన భేటీ అయ్యారని పార్టీవర్గాలు చెబుతున్నమాట.. ఓవైపు.. భారత్ జోడో యాత్రతో ప్రజల మధ్య రాహుల్ గాంధీ ఉన్న సమయంలో వస్తున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఉత్కంఠగా మారింది.
