Site icon NTV Telugu

PM Modi: వారణాసిలో మోడీని ఓడించేందుకు ఇండియా కూటమి బిగ్ ప్లాన్.. పోటీలో ఉండేది వీళ్లేనా.?

Pm Modi

Pm Modi

PM Modi: లోక్‌సభ ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి, ప్రధాని మోడీని గద్దె దించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే భారీ ప్లాన్‌తో కూటమి కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీనే టార్గెట్‌గా వారణాసిలో ఆయనను ఓడించేందుకు రాజకీయ ప్రముఖుల్ని బరిలో దించేందుకు కూటమి భావిస్తు్న్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

వారణాసిలో 1991 నుంచి బీజేపీకే ఓటర్లు పట్టం కట్టారు. ఒక్క 2004లో తప్పితే అన్ని సార్లు బీజేపీనే గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి మోడీ పోటీ చేసి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ సారి 2024 ఎన్నికల్లో ప్రధానిని వారణాసి నుంచి ఓడించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

Read Also: Lalu Yadav: “ల్యాండ్ ఫర్ జాబ్” స్కామ్.. లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు..

అయితే, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్లను పోటీలోకి దింపడానికి పరిశీలిస్తున్నట్లు సమచారం. గతంలో బీజేపీకి మిత్రుడిగా ఉన్న నితీష్ కుమార్ ఎన్డీయే నుంచి వైదొలిగి, ఇండియా కూటమిలో చేరారు. కూటమి తరుపున ప్రధాని రేసుల్లో వినిపిస్తున్న పేర్లలో నితీష్ కుమార్ పేరు కూడా ఒకటి. తనకు ప్రధాని కావాలనే ఆశ లేదని ఇతను పలుమార్లు చెప్పడం గమనార్హం.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి 2019లోనే వారణాసి నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని అంతా అనుకున్నారు, కానీ చివరకు మరోసారి కాంగ్రెస్ అజయ్ రాయ్‌ని రంగంలోకి దించింది. ప్రధాని కన్నా 5 లక్షల ఓట్ల తేడాతో మూడోస్థానంలో నిలిచారు. అయితే ఈసారి ఆమెను బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఇండియా కూటమి మూడో వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2014లో ప్రధాని మోడీపై వారణాసి నుంచి ఆప్ తరుపున కేజ్రీవాల్ బరిలో నిలిచి 2 లక్షల ఓట్లు, దాదాపుగా 20 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని ప్రధాని అభ్యర్థిగా టీఎంసీ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించగా.. కేజ్రీవాల్ సపోర్ట్ చేశారు. అయితే ముందు ఎన్నికల్లో గెలవాలని ఖర్గే అంటున్నారు.

Exit mobile version