కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్‌ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులను ఓ కారు ఢీ కొట్టింది. ఆ ఘటనలో కొంత మంది రైతులు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపింది హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకేనంటూ ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సిట్ విచారణ జరిపి ఆ ఘటన కుట్రపూరితంగానే జరిగిందని వెల్లడించింది. అంతేకాకుండా దీనిపై నివేదకను కూడా సమర్పించింది.
ఈ క్రమంలో నేడు జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ ఈ ప్రమాదంపై చర్చించాలని కోరారు. ఆ ఘటనపై చర్చలను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది. అనంతరం పార్లమెంట్ నుంచి బయటకు వచ్చిన రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. లఖింపూర్ ఖేరీ సంఘటన ఒక కుట్ర అని సిట్ చెప్పందన్నారు.ఇది స్పష్టంగా ఉందని.. ఎవరి కొడుకు ప్రమేయం ఉందో అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. ఈ ఘటనపై బాధ్యత వహించి హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని కోరుకుంటున్నామని రాహుల్ అన్నారు. పార్లమెంటులో చర్చ జరగాలని మేము కోరుకుంటున్నామని, కానీ ప్రధానమంత్రి సాకులు చెబుతూ తిరస్కరించారన్నారు.