PM Modi: బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, వీటిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక హోదా రద్దు చేసినందుకు బీఆర్ అంబేద్కర్ తనను తప్పక ఆశీర్వదిస్తారని ప్రధాని మోడీ అన్నారు. ‘‘రాజ్యాంగంలో చాలా ముఖ్యమైనది అయితే, ఆర్టికల్ 370 రద్దు చేసేంత వరకు దేశం మొత్తం ఒకే రాజ్యాంగం ఎందుకు అమలులోకి రాలేదు..? వేర్పాటువాదుల పట్ల మెతక వైఖరితో ప్రతిపక్షాలు ఇలా చేశాయి’’ అని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంబేద్కర్ ఆత్మ మోడీని ఆశీర్వదిస్తుందని చెప్పారు.
Read Also: Middle East tensions: ఇజ్రాయిల్, ఇరాన్ వెళ్లొద్దని భారతీయులకు కేంద్రం కీలక ఆదేశాలు..
బీజేపీ ప్రభుత్వానికి దేశ రాజ్యాంగమే సర్వస్వమని, బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా వ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీని విధించడం ద్వారా రాజ్యాంగాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తాము మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తాయని ప్రతిపక్షాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఎమర్జె్న్సీ సమయంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లలేదా..? అని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగే 7 దశల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మొదటి దశలో ఎన్నికలు జరిగే మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో దళితులు, గిరిజనులకు ప్రస్తుతం రాజ్యాంగ హక్కులు లభించాయని, కాంగ్రెస్ హయాంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారిని విస్మరించారని ప్రధాని మోడీ అన్నారు.