NTV Telugu Site icon

Viral: మహిళను తొక్కి చంపిన ఏనుగు.. అంత్యక్రియలు కూడా అడ్డుకొని..!

Elephant

Elephant

గజరాజుకు కోపం వస్తే ఏం జరుగుతోందో.. ఎలా ప్రవర్తిస్తోందో ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ప్రశాంతంగా ఉండే గజరాజుకు కోపం వచ్చిందంటే.. ఆపడం ఎవరితరం కాదు.. విధ్వంసం సృష్టిస్తోంది.. పంట పొలాలు, వాహనాలు, ప్రజలు, జంతువులు.. ఇలా ఏది అడ్డువచ్చినా.. అడ్డుకోవడం కష్టమే.. అయితే, తాజాగా ఓ ఏనుగు ప్రవర్తించిన తీరు మాత్రం సోషల్‌ మీడియాకు ఎక్కింది.. ఔరా..! ఆ గజరాజు ఎందుకు ఇలా చేశాడు..? మహిళలను తొక్కి చంపడం ఏంటి..? ఆ తర్వాత అంత్యక్రియలను కూడా అడ్డుకోవడం ఏంటి..? అంటూ అంతా ఆశ్చర్యపోయేలా చేసింది. అంతే కాదు.. ఆ ఘటన వెనుక ఓ స్టోరీని కూడా తెరపైకి తెస్తున్నారు.

Read Also: Rahul Gandhi At ED Office: ఈడీ ముందుకు రాహుల్‌.. విచారణ ప్రారంభం

ఒడిశాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మయూర్‌భంజ్ జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసింది ఓ ఏనుగు.. రాయ్‌పల్‌ గ్రామంలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల వృద్ధురాలు మయ ముర్మూ.. తాగు నీటి కోసం సమీపంలోని పంపు మోటర్‌ దగ్గరకు వెళ్లగా.. పొలాల్లోకి దూసుకొచ్చిన ఓ ఏనుగు.. ఆమె దాడి చేసింది.. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. కానీ, అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. ఇక, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బంధువులు, స్థానికులు.. మృతదేహాన్ని ఊరేగింపుగా స్మశనవాటికకు తరలించారు. మృతదేహాన్ని చితి మీద పెట్టే సమయానికి మరోసారి ఎంట్రీ ఇచ్చింది ఆ ఏనుగు.. భయంతో అక్కడివారు పరుగులు తీయగా.. చితి మీద నుంచి శవాన్ని తొండంతో ఎత్తి పడేసింది.. కిందపడేసి తొక్కింది.. ఆ వృద్ధురాలి శవాన్ని దూరంగా విసిరేసంది.. ఇక, ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది..

ఈ ఘటన వెనుక స్థానికులు ఓ స్టోరీని చెబుతున్నారు.. మయ ముర్మూ భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడట.. అయితే, ఆయనకు విషం పెట్టి మయ ముర్మూ చంపేసిందనే ప్రచారం కూడా ఉందట.. దీంతో, ఆమెపై కోపంతో ఉన్న భర్త.. ఆత్మగా మారి.. ఆ ఏనుగులో ప్రవేశించి.. ఇప్పుడు ఆమెను చంపేశాడని.. కనీసం అంత్యక్రియలను కూడా సజావుగా సాగకుండా చేశాడని.. గ్రామస్తుల జోలికే రాలేదని కథలు కథలుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.