NTV Telugu Site icon

Eknath Shinde: డిప్యూటీ సీఎం పదవికి షిండే గ్రీన్‌సిగ్నల్.. రేపే ప్రమాణం

Eknathshinde

Eknathshinde

మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. నవంబర్ 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి (శివసేన, బీజేపీ, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది. కానీ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. డైలీ సీరియల్‌ లాగా దాదాపు 11 రోజుల పాటు సీఎం పోస్టుపై పంచాయితీ నడిచింది.

శివసేన ముఖ్యమంత్రి పదవిని ఆశించింది. అందుకు బీజేపీ నిరాకరించింది. బీజేపీకి 132 సీట్లు రాగా.. శివసేనకు కేవలం 57 సీట్లే వచ్చాయి. అయితే బీహార్ ఫార్ములా అమలు చేయాలని.. నితీష్ కుమార్‌ను సీఎంను చేసినట్లుగా షిండేను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టాలని శివసేన డిమాండ్ చేసింది. ఇలా మహారాష్ట్ర పంచాయితీ రెండు వారాల పాటు సాగింది. మొత్తానికి బీజేపీ అధిష్టానం.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని రంగంలోకి దింపింది. చర్చోప చర్చల తర్వాత శివసేన మెత్తబడింది. బీజేపీ ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా దేవేంద్ర ఫఢ్నవిస్ ముఖ్యమంత్రిగా.. డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణం చేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో 11 రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఫుల్‌స్టాప్ పడింది. గురువారం ఆజాద్ మైదాన్‌లో దేవేంద్ర ఫఢ్నవిస్, షిండే, అజిత్ పవార్‌తో పాటు పలువురు కూటమి సభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: పదేళ్లలో ఏం చేయకపోగా.. 10 నెలల మా పాలనపై విష ప్రచారం చేస్తున్నారు..

బుధవారం ఫడ్నవిస్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం షిండే, అజిత్ పవార్‌తో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఫడ్నవిస్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గురువారం సాయంత్రం 5:30 గంటలకు ఆజాద్ మైదాన్‌లో ప్రమాణస్వీకారం జరగనుంది. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, ఎన్డీఏ ముఖ్యనేతలు హాజరుకానున్నారు.

కొత్త ప్రభుత్వంలో 7:7:7 నిష్పత్తిలో మూడు పార్టీలు మంత్రుల పదవులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఏడుగురు, శివసేన నుంచి ఏడుగురు, ఎన్సీపీ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ -132, శివసేన-57, ఎన్సీపీ-41, కాంగ్రెస్-16, ఉద్ధవ్ థాక్రే-20, శరద్ పవార్-10 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: పదేళ్లలో ఏం చేయకపోగా.. 10 నెలల మా పాలనపై విష ప్రచారం చేస్తున్నారు..

Show comments