మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. తాజాగా శనివారం ముఖ్యమంత్రి ఫడ్నవిస్.. మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే ఏక్‌నాథ్ షిండేకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన ఆశించిన హోంశాఖ దక్కలేదు. ముఖ్యమంత్రి పదవి కోసం చాలా రోజులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో హోంశాఖ అయినా దొరుకుతుందని ఆశ పడ్డారు. తీరా ఆ శాఖ కూడా దక్కకుండా పోయింది. షిండేకు మూడు పోర్ట్‌ఫోలియోలు దక్కాయి. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, ప్రజా పనుల ఫోలియోలు దక్కాయి.
ఫడ్నవిస్ దగ్గర హోంశాఖ, లా, న్యాయశాఖలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫైనాన్స్, ప్లానింగ్, ఎక్సైజ్ శాఖలు కేటాయించారు. మొత్తానికి 4 వారాల చర్చల తర్వాత ఈ ఫోర్ట్‌పోలియో జరగడం విశేషం.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు గాను మహాయుతి కూటమి 230 స్థానాల్లో గెలిపొందింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది. అయితే షిండే తిరిగి సీఎం పదవి ఆశించారు. కానీ ఆ పదవిని బీజేపీ దక్కించుకుంది. కనీసం హోంశాఖ అయినా దక్కుతుందని ఆశించారు. చివరికి ఆ పదవి కూడా దూరమైపోయింది.