Maharashtra: మహారాష్ట్ర మహయుతి ప్రభుత్వంలో విభేదాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే వ్యవహార శైలి చూస్తే ఇది నిజమని తెలుస్తోంది. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన-షిండే, ఎన్సీపీ-అజిత్ పవార్‌ల కూటమి ఘన విజయం సాధించింది. అయితే, మరోసారి సీఎం పదవిని కోరుకున్న ఏక్‌నాథ్ షిండే ఆశ నెరవేరలేదు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు.
ఇదిలా ఉంటే, సోమవారం, తన గృహనిర్మాణ శాఖకు సంబంధించిన ప్రాజెక్టుతో సహా ముఖ్యమైన ప్రాజెక్టులను చర్చించడానికి ఫడ్నవీస్ పిలిచిన సమావేశానికి షిండే హాజరు కాలేదు. శివసేన నుండి సహాయ మంత్రి (MoS) యోగేష్ కదమ్ షిండే ప్రాతినిధ్యం వహించారు. గత వారం, షిండే కూడా క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య సంబంధాలు బాగా లేవనే పుకార్లకు ఈ పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే, శివసేన ఎంపీ నరేష్ మష్కే మాట్లాడుతూ, షిండే కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురైనందున ఆయన సమావేశానికి హాజరు కాలేదని అన్నారు.
అజిత్ పవార్ ఎన్సీపీ కూడా ఈ పరిణామాలపై నోరు విప్పలేదు. ‘‘ఆయన (షిండే) సమావేశానికి ఎందుకు రాలేదో మనకు ఎలా తెలుస్తుంది? సమావేశం జరిగి, ఆయన రాకపోతే, ఆయనను ఎందుకు రాలేదో అడగండి” అని ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బాల్ అన్నారు. ఈ పరిణామాలపై ఉద్ధవ్ శివసేన విమర్శలు గుప్పించింది. షిండేకు బీజేపీ అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తోందంటూ ఆ వర్గం నేత అరవింద్ సావంత్ అన్నారు. ఉద్ధవ్ వర్గం నేత ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందని అన్నారు.